https://oktelugu.com/

Brother Anil Kumar: జగన్ ఓడిపోవాలని భగవంతుడిని కోరుతున్న బ్రదర్ అనిల్ కుమార్.. కారణమదే?

తాజాగా ఏపీలోకి బ్రదర్ అనిల్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. పాస్టర్లతో సమావేశం అవుతున్నారు.అమలాపురంలోని ఇందుపల్లిలో పాస్టర్ల సదస్సులో బ్రదర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : March 11, 2024 / 09:21 AM IST

    Brother Anil Kumar

    Follow us on

    Brother Anil Kumar: గత ఎన్నికల్లో వైసిపి అంతులేని విజయానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జగన్ కు అన్ని వర్గాల్లో అనుకూల ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆ మతం ఈ మతం అన్న తేడా లేకుండా అందరిలోనూ పాజిటివ్ కోణం తేవడానికి చాలామంది కష్టపడ్డారు. హిందువుల నుంచి స్వరూపానందేంద్ర, రమణ దీక్షితులు, క్రిస్టియన్ వర్గాల నుంచి బ్రదర్ అనిల్ కుమార్ ఉండనే ఉన్నారు. ఇలా మతాలకు అతీతంగా జగన్ ఆదరణ పొందడానికి వీళ్లంతా కారణమయ్యారు. కానీ ఈ ఎన్నికల్లో వారే తిరుగుబాటు చేస్తుండడం విశేషం. రమణ దీక్షితులు అయితే ఏకంగా టిటిడి పై ఆరోపణలు చేశారు. జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై టిటిడి పోలీస్ కేసు కూడా పెట్టింది. ఇక బ్రదర్ అనిల్ కుమార్ గురించి చెప్పనవసరం లేదు. ఆయన జగన్ సర్కార్ పై ఏకంగా యుద్ధమే ప్రకటించారు.

    ఆ మధ్యన జగన్ మేనత్త విమలారెడ్డి పాస్టర్లతో సమావేశం అయ్యారు. క్రిస్టియన్లు బాగుండాలంటే మరోసారి జగన్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. అసలు జగన్ కుటుంబానికి ఏం అన్యాయం చేశాడని ప్రశ్నించారు. బ్రదర్ అనిల్ కుమార్ కు విరుగుడుగా విమలారెడ్డిని తెరపైకి తెచ్చారన్నది బహిరంగ రహస్యం. విశాఖ కేంద్రంగా చేసుకొని కొన్ని కీలక బాధ్యతలు ఆమెకు అప్పగించారు. బ్రదర్ అనిల్ కుమార్ ద్వారా ఎదురయ్యే పరిణామాలను ఊహించి.. క్రిస్టియన్ ఓటు బ్యాంకు పోకుండా ఆమె కీలక పాత్ర పోషించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆమె తన కార్యాచరణను ప్రారంభించారు.

    అయితే తాజాగా ఏపీలోకి బ్రదర్ అనిల్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. పాస్టర్లతో సమావేశం అవుతున్నారు.అమలాపురంలోని ఇందుపల్లిలో పాస్టర్ల సదస్సులో బ్రదర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. జగన్ పాలనలో క్రైస్తవులు పడుతున్న ఇబ్బందుల పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని గుర్తు చేశారు. కానీ జగన్ స్వతహాగా క్రైస్తవుడు అయినా ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో సువార్త మహాసభలు పెట్టుకునే అవకాశం ఇవ్వడం లేదని కూడా చెప్పుకొచ్చారు. దీంతో తనకు ఎదురైన పరిణామాలను వివరించే ప్రయత్నం చేశారు. బ్రదర్ అనిల్ కుమార్ సువార్త సభలు కూడా ఏపీలో ఎక్కడా కనిపించడం లేదు. దీనికి జగన్ సర్కారే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం వల్లే ఈ సభలు జరగడం లేదని తెలుస్తోంది.

    బ్రదర్ అనిల్ కుమార్ నేరుగా జగన్ సర్కార్ పై రాజకీయ విమర్శలు చేశారు. ఏపీలో అప్పులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రేపు పుట్టబోయే బిడ్డల పైన అప్పుల భారం పడే పరిస్థితి ఉందని ప్రజలను హెచ్చరించారు. రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్ధాలు తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అనిల్ పేర్కొన్నారు. ఒక మత ప్రబోధకుడిగా జగన్ ను గెలిపించడం అంటే దేవుడిని మోసం చేయడమేనని ఆయన తేల్చి చెప్పారు. శత్రువులందరూ నాశనమైపోవాలని ఆయన శపించడం కూడా విశేషం. అంటే బ్రదర్ అనిల్ కుమార్ జగన్ దిగిపోవాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. నేరుగా దేవుడిని కోరుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.