Brahmani Steel Lands: 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో దాదాపు 14 వేల ఎకరాల భూమి గాలి జనార్దన్ రెడ్డి సంస్థకు కేటాయించబడింది. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంది. ఈ సంఘటన రాయలసీమ అభివృద్ధి, రాజకీయ సంబంధాలు, భూమి వినియోగం వంటి అంశాలపై ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.
భూమి కేటాయింపు వివరాలు
జమ్మలమడుగు మండలంలో 10,700 ఎకరాలు స్టీల్ ప్లాంటు కోసం, 3,115 ఎకరాలు ఎయిర్ పోర్టు కోసం కేటాయించారు. మొత్తం సుమారు 13,885 ఎకరాలు. «స్టీల్ ప్లాంటుకు ఎకరానికి రూ.18 వేలు, ఎయిర్ పోర్టుకు ఎకరానికి రూ.25 వేలు చొప్పున భూములు కేటాయించారు. దీంతో గాలి జనార్దన్ రెడ్డి సంస్థ సుమారు 27 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి ఈ విస్తీర్ణ భూమిని పొందింది. ఆ సమయంలో రాయలసీమలో ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధి జరుగుతాయని ప్రకటించారు.
రాజకీయ సంబంధాలు..
ఈ కేటాయింపు వెనుక రాజకీయ, వ్యాపార సంబంధాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. అప్పట్లో జగన్ మోహన్‌రెడ్డి బెంగళూరులో ఉండి వ్యాపారాలు చేస్తుండగా, గాలి జనార్దన్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఈ సంబంధం ద్వారా కడపలో స్టీల్ ప్లాంటు ప్రాజెక్టు ముందుకు సాగింది. అనంతపురం, కర్ణాటక–ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోని ఇనుప ఖనిజ గనులు కూడా కేటాయించబడ్డాయి. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నాయకుడిగా ఉన్నప్పటికీ, ఆయనకు వివిధ పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు టూరిజం శాఖ మంత్రి పదవి లభించింది. బ్రాహ్మణి స్టీల్ శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రాజెక్టు అమలులో విఫలం..
స్టీల్ ప్లాంటు, ఎయిర్ పోర్టు నిర్మాణం ద్వారా రాయలసీమ ముఖచిత్రం మారుతుందని ఆశలు వ్యక్తం చేశారు. కానీ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. గాలి జనార్దన్ రెడ్డి హవా పీక్‌లో ఉన్నప్పుడు ఈ ఒప్పందాలు జరిగాయి. తర్వాత అక్రమ మైనింగ్ ఆరోపణలు, లోకాయుక్త, సీబీఐ దర్యాప్తులు మొదలయ్యాయి. యూపీఏ కేంద్ర ప్రభుత్వ కాలంలో కూడా ఫండింగ్ సంబంధిత ఆరోపణలు వచ్చాయి. యస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత గాలి జనార్దన్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. బ్రాహ్మణి స్టీల్ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది.
బ్యాంకులో భూమి తాకట్టు..
ప్రాజెక్టు ఆగిపోయిన తర్వాత 10,700 ఎకరాల భూమిని యాక్సిస్ బ్యాంకుకు తాకట్టు పెట్టి రూ.350 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే ఒప్పందంలో భూమిని తాకట్టు పెట్టకూడదని స్పష్టమైన నిబంధన ఉంది. ఈ రుణంలో కొంత భాగం ఎన్నికల ఖర్చులకు వెళ్లిందని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూములను వెనక్కి తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. యాక్సిస్ బ్యాంకు కోర్టుకు వెళ్లి ఉత్తర్వులను అడ్డుకుంది. 18 ఏళ్ల పోరాటం తర్వాత కోర్టు బ్యాంకుకు ఎలాంటి హక్కు లేదని తీర్పు ఇచ్చింది.
కూటమి ప్రభుత్వం సా«్వధీనం..
ప్రస్తుత కూటమి ప్రభుత్వం కలెక్టర్ ఉత్తర్వుల ద్వారా ఈ భూములను వెనక్కి తీసుకుంది. వీటిని మళ్లీ పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. ప్రస్తుతం ఈ 14 వేల ఎకరాల విలువ సుమారు రూ.5,000 కోట్లుగా అంచనా. అదే జమ్మలమడుగు మండలంలో జిందాల్ సంస్థ రూ.16,000 కోట్ల పెట్టుబడితో రాయలసీమ స్టీల్ ప్లాంటు నిర్మాణం చేపట్టింది.
ఈ వ్యవహారం రాజకీయ సంబంధాల ఆధారంగా చౌకగా ప్రజా భూములు కేటాయించడం వల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో చూపిస్తోంది. రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతంలో అభివద్ధి ప్రాజెక్టులు రాజకీయ ప్రభావాలకు లోనవ్వకుండా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. 18 ఏళ్లపాటు ఒక ప్రాజెక్టు నిలిచిపోవడం వల్ల ప్రాంతీయ అభివృద్ధి ఆలస్యమైంది. ఇప్పుడు భూములు వెనక్కి రావడం ద్వారా ప్రభుత్వం చట్టబద్ధమైన చర్య తీసుకున్నట్లు కనిపిస్తోంది.
