BPCL: రూ.60 వేల కోట్లతో ఏపీకి మరో ప్రాజెక్ట్

ఏపీలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో 60 వేల కోట్లతో ఈ రిఫైనరీ ఏర్పాటు జరగనున్నట్లు సమాచారం.

Written By: Dharma, Updated On : July 5, 2024 11:23 am

BPCL

Follow us on

BPCL: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది. కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంద్రబాబు కలవగా.. రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మరో కేంద్రమంత్రి ఏకంగా 60 వేల కోట్ల ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనిపై సత్వర చర్యలు సైతం ప్రారంభమైనట్లు సమాచారం.

ఏపీలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో 60 వేల కోట్లతో ఈ రిఫైనరీ ఏర్పాటు జరగనున్నట్లు సమాచారం. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మంత్రితో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని.. కీలక ప్రాజెక్టుల చేపట్టడానికి అవకాశం అధికమని చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు అభిప్రాయంతో ఏకీభవించారు.

అయితే ఈ విషయంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి క్రియాశీలక పాత్ర పోషించారు. జనసేన నుంచి ఆయన ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటు బాలశౌరి కూడా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రితో సమావేశమయ్యారు. బందరులో బిపిసిఎల్ ప్రాజెక్టు ఏర్పాటుకు రెండు నుంచి మూడు వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని తెలిపారు. అంతకంటే ఎక్కువ అవసరం ఉన్న కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బాలశౌరి కేంద్రమంత్రికి వివరించారు. దీంతో త్వరలోనే దీనిపై ఒక అధికార ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు సమాచారం. నాలుగుగేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్లే మచిలీపట్నాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తొలుత కాకినాడలో ఏర్పాటుకు కేంద్రం మొగ్గు చూపింది. కానీ అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. మచిలీపట్నంలోని ఏర్పాటు చేయాలని కోరినట్లు సమాచారం. బిపిసిఎల్ రిఫైనరీ ఏర్పాటుతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి పెరిగే అవకాశాలు ఉన్నాయి.