Anand Mahindra: ఈ డ్రోన్లు ప్రాణాలు కాపాడతాయి.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

సాధారణంగా డ్రోన్ లను కఠినతరమైన ఆపరేషన్లకు వాడుతుంటారు. గత ఐదేళ్లుగా డ్రోన్లను కేవలం యుద్ధాల సమయంలోనే ఉపయోగిస్తున్నారు. ఇటీవల ఇజ్రాయిల్ గాజానగరం పై దాడులు చేసినప్పుడు డ్రోన్లను ఉపయోగించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 5, 2024 12:34 pm

Anand Mahindra

Follow us on

Anand Mahindra: సోషల్ మీడియాలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు పంచుకుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులకు సంబంధించిన వీడియోలను ఆయన తన ట్విట్టర్ ఎకౌంట్లో తరచూ పోస్ట్ చేస్తుంటారు.. వినూత్నంగా ఉండే కొత్త కొత్త పరికరాలను తనను అనుసరించే వారికి పరిచయం చేస్తుంటారు. అలా తన ట్విట్టర్ ఎకౌంట్లో ఒక డ్రోన్ కు సంబంధించిన వీడియోను ఆనంద్ పోస్ట్ చేశారు. ఇంతకీ ఈ డ్రోన్ ప్రత్యేకతలు ఏంటంటే..

సాధారణంగా డ్రోన్ లను కఠినతరమైన ఆపరేషన్లకు వాడుతుంటారు. గత ఐదేళ్లుగా డ్రోన్లను కేవలం యుద్ధాల సమయంలోనే ఉపయోగిస్తున్నారు. ఇటీవల ఇజ్రాయిల్ గాజానగరం పై దాడులు చేసినప్పుడు డ్రోన్లను ఉపయోగించింది. అయితే డ్రోన్లు విధ్వంసకర ఆపరేషన్లలో మాత్రమే కాకుండా.. ప్రాణాలు కాపాడటంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేశారు. ఆనంద్ పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. అది ఒక హైబ్రిడ్ డ్రోన్. దీనికి నాలుగు క్వాడ్ క్వాప్టర్స్ ఉంటాయి. వీటి ద్వారా ఈ డ్రోన్ వేగవంతంగా పనిచేస్తుంది. నీటిలో ఎవరైనా మునిగినప్పుడు.. లేదా ప్రమాదం అంచున ఉన్నప్పుడు ఈ డ్రోన్ లైఫ్ బాయ్ అవతారం ఎత్తుతుంది. గంటకు 29 కిలోమీటర్ల వేగంతో పది నిమిషాల పాటు గాలిలో ఎగర గల సత్తా ఈ డ్రోన్ సొంతం.. ఆపద సమయంలో వెంటనే లక్షిత ప్రాంతం వద్దకు వెళ్లి.. సహాయక చర్యల్లో తన వంతు పాత్ర పోషిస్తుంది. ఎవరైనా నీటిలో మునుగుతున్నప్పుడు ఆ వ్యక్తి వద్దకు వెళ్లి.. కాపాడే చర్యల్లో నిమగ్నమవుతుంది.

ఈ డ్రోన్ TY-3R రకానికి చెందింది. ఇందులో టెలిటబుల్ ఆన్ బోర్డ్ కెమెరా ఉంది. దీని ద్వారా రియల్ టైం విజువల్స్ తీస్తుంది. ఎప్పటికప్పుడు దృశ్యాలను అటాచ్ చేసిన డివైస్ కు పంపిస్తుంది. నీళ్లల్లో మునిగిపోతున్న వారికి రబ్బర్ ట్యూబులు (బయటనుంచి మనమే ఇవ్వాల్సి ఉంటుంది) అందిస్తుంది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయగా లక్షల మంది వీక్షించారు. ఇదే సమయంలో ఇలాంటి ఆవిష్కరణలు మరిన్ని వెలుగులోకి రావాలంటూ ఆనంద్ ఔత్సాహిక ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. ఈ డ్రోన్ ను ఆయన లైఫ్ బాయ్ అని సంబోధించడం విశేషం.