Botsa Satyanarayana: ఏపీ రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ ది ప్రత్యేక స్థానం. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే ఆయన ఎదిగిపోయారు. రాష్ట్ర నేతగా మారిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఒకానొక దశలో ఆయన పేరు సీఎం పదవికి వినిపించింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత.. క్యాబినెట్లో సీనియర్ గా ఉన్న బొత్స పేరును పరిశీలించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే చివరి నిమిషంలో మారిన సమీకరణల నేపథ్యంలో బొత్సకు అవకాశం లేకుండా పోయింది. కిరణ్ కుమార్ రెడ్డి ని ముఖ్యమంత్రి చేసిన హై కమాండ్ .. బొత్సకు పిసిసి పగ్గాలు అందించింది. కానీ బొత్స అందుకే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు. తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. బొత్స సమర్థతను గుర్తించిన జగన్ 2018 ఎన్నికలకు ముందు వైసీపీలో చేర్చుకున్నారు. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసిపి ఏకపక్ష విజయం వెనుక బొత్స ఉన్నారు. అందుకే జగన్ తన క్యాబినెట్లోకి బొత్స సత్యనారాయణను తీసుకున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కూడా బొత్సను కొనసాగించారు.
* కుటుంబమంతా ఓటమి
ఈ ఎన్నికల్లో బొత్స తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా ఓడిపోయారు.చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్సకు ఓటమి తప్పలేదు. ఆయన సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం నియోజకవర్గ నుంచి ఓడిపోయారు. మరో సోదరుడు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి దారుణ పరాజయం చవిచూశారు. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మీ సైతం ఓడిపోయారు.ఇటువంటి తరుణంలో అరుదైన అవకాశం ఇచ్చారు జగన్. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అంతకుముందు ఉభయగోదావరి జిల్లాల వైసీపీ సమన్వయకర్తగా బొత్స నియమితులయ్యారు.
* డాక్టర్ సందీప్ కు బాధ్యతలు
అయితే బొత్స ఇప్పుడు విజయనగరం విడిచిపెట్టారు. విశాఖ జిల్లా పై ఫుల్ కాన్సెంట్రేషన్ చేశారు. విజయనగరం జిల్లా రాజకీయాలు ఆయన మేనల్లుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ అలియాస్ చిన్న శ్రీను చూసుకుంటున్నారు. అటు బొత్స ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి బాధ్యతలను సైతం చిన్న శ్రీను చూసుకునేవారు. కానీ ఇప్పుడు తాజాగా ఆ బాధ్యతలను బొత్స కుమారుడు డాక్టర్ సందీప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు సందీప్. ఇప్పటికే కుటుంబంలో ఎక్కువమందికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో జగన్ అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు తండ్రి విశాఖ నగరానికి వెళ్లడంతో చీపురుపల్లి బాధ్యతలు సందీప్ తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్సకు బలమైన కేడర్ ఉంది. వచ్చే ఎన్నికల్లో సందీప్ పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారన్న విశ్వాసం వైసీపీ శ్రేణుల్లో ఉంది. అధినేత జగన్ తో పాటు బొత్స సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తరచూ చీపురుపల్లిలో పర్యటిస్తున్నారు డాక్టర్ సందీప్. మరి ఆయన ఎంతవరకు ముద్ర చూపగలరో చూడాలి.