Gudiwada Amarnath : పవన్ పై విరుచుకుపడిన వైసీపీ నేతల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒకరు. ఒకానొక దశలో పవన్ కంటే తానే గొప్ప అన్న మాదిరిగా మాట్లాడారు. పవన్ నాతో ఫోటో దిగడానికి ఆరాట పడ్డారని కూడా చెప్పడానికి వెనక్కి తగ్గలేదు.ఒక విధంగా చెప్పాలంటే పవన్ ను చాలా తేలిగ్గా మాట్లాడిన వారిలో గుడివాడ అమర్నాథ్ ఒకరు. అయితే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి ఓటమి అంటే గుడివాడ అమర్నాథ్ దే. ఆయనపై పోటీ చేసిన టిడిపి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఏకంగా 95 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇది. ఒక సిట్టింగ్ మంత్రిగా ఉంటూ.. గుడివాడ అమర్నాథ్ ఓటమి తీరు చూస్తే మాత్రం ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఈ ఓటమికి పవన్ కళ్యాణ్ అని ఆలస్యంగా తెలుసుకున్నారు గుడివాడ అమర్నాథ్. తాజాగా టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ను తక్కువ అంచనా వేశానని.. అందుకు ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నానని చెప్పుకొచ్చారు. పవన్ విషయంలో తాను తొందర పడ్డానని కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
* గట్టిగానే వాయిస్
2019 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గుడివాడ అమర్నాథ్. 2014లో అదే అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2014 నుంచి 2019 మధ్య వైసీపీ వాయిస్ గట్టిగానే వినిపించారు. దీంతో జగన్ అమర్నాథ్కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో అమర్నాథ్ కు తన క్యాబినెట్లో చోటిచ్చారు. అయితే మంత్రిగా కంటే పవన్ పై విమర్శలకి ఎక్కువగా పరిమితం అయ్యారు అమర్నాథ్. శాఖ పరంగా పెద్ద ప్రభావం చూపలేకపోయారు. పైగా ప్రత్యర్థుల ట్రోల్ కు గురయ్యారు. ముఖ్యంగా జనసైనికులు టార్గెట్ చేసుకున్నారు.
* పవన్ పై చులకన వ్యాఖ్యలు
వాస్తవానికి అమర్నాథ్ అభిప్రాయం వేరేలా ఉండేది పవన్ కళ్యాణ్ పై. జగన్ కంటే జనాదరణ తక్కువ కలిగిన నేతగా చులకనగా చూసేవారు. ఈ క్రమంలో పవన్ కంటే తనకు గుర్తింపు ఎక్కువ అని చెప్పుకున్నారు. ఈ క్రమంలో పవన్ ఓసారి తనతో ఫోటోకు దిగారని చెప్పుకొచ్చారు. దీనిపైనే సర్వత్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే గుడివాడ అమర్నాథ్ దీనిపైనే ఎక్కువ ట్రోల్ కు గురయ్యారు. ఇప్పుడు అదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు అమర్నాథ్. నాడు పవన్ విషయంలో తాను చేసిన కామెంట్స్ చాలా నష్టానికి గురిచేశా యని ఆవేదన వ్యక్తం చేసుకున్నారు అమర్నాథ్. రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయాన్ని తనంతట తాను ప్రస్తావించారు. అందుకు తాను పవన్ పై చేసిన వ్యాఖ్యలే కారణమని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే గుడివాడ అమర్నాథ్ లో ఒకరకమైన పశ్చాత్తాపం కనిపిస్తోంది.