Blind Girl Maruvada Rashmi: కొన్నేళ్ల కిందట ప్రేమించు( preminchu ) అనే సినిమా వచ్చింది. సురేష్ ప్రొడక్షన్ లో వచ్చిన ఆ సినిమా మంచి హిట్ దక్కించుకుంది. చిన్న సినిమా అయినా మెగా హిట్ అందుకుంది. ఓ అంధురాలు సొంత తల్లి ఆదరణకు నోచుకోక.. సమాజంలో ఇబ్బందులు పడుతూ న్యాయవాద వృత్తిని పూర్తిచేస్తుంది. తన విషయంలో అమానుషంగా వ్యవహరించిన తల్లిని.. ఓ కేసు నుంచి విముక్తి కల్పించి కనువిప్పు కల్పిస్తుంది. అయితే సమాజంలో అటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా విశాఖలో రష్మీ అనే ఒక అంధురాలు అదే మాదిరిగా న్యాయవిద్య పట్టా తీసుకోవడం విశేషం. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది ఆమె.
పుట్టుకతోనే వైకల్యం..
విశాఖకు చెందిన మరువాడ రష్మీకి( maruvada Rashmi ) పుట్టుకతోనే రెండు కళ్ళు లేవు. విధి రాతను ఆమె తప్పించుకోలేకపోయారు. అయితే తన తలరాతను తానే మార్చుకోవాలని భావించారు. తన కళ్ళతో లోకాన్ని చూడకపోయినా.. ఈ సమాజంలో తనకంటూ నిరూపించుకోవాలని సంకల్పించారు. న్యాయవిద్యను పూర్తిచేసుకుని పట్టా అందుకున్నారు. శుక్రవారం విశాఖలో జరిగిన స్నాతకోత్సవంలో ప్రముఖ న్యాయమూర్తుల చేతులమీదుగా బిఏ ఎల్.ఎల్.బి పట్టా అందుకున్నారు. ఆ మహోన్నత క్షణంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
ప్రోత్సహించిన తండ్రి..
విశాఖకు చెందిన మరువాడ రష్మీ తండ్రి ఉద్యోగరీత్యా కోల్కత్తాలో( Kolkata) ఉంటున్నారు. కుమార్తె రష్మీ చదువుకోవాలన్న ఆశయం చూసి తండ్రి ఎంతగానో ప్రోత్సహించారు. కంటి చూపు లేకపోవడంతో రష్మీ బ్రెయిలీ లిపి నేర్చుకున్నారు. పదితోపాటు ఇంటర్లో కూడా బ్రెయిలీ లిపిలోనే పూర్తి చేశారు. అద్భుత తెలివితేటలతో పదో తరగతిలో 77%, ఇంటర్లో 85% మార్కులతో సత్తా చాటారు. న్యాయవిద్య పై ఆసక్తితో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రాసి ఉత్తమ ర్యాంక్ సాధించారు. 2018లో విశాఖ దామోదరం సంజీవయ్య న్యాయ యూనివర్సిటీలో ఐదేళ్ల ఎల్.ఎల్.బిలో ప్రవేశం పొందారు. అక్కడ బ్రెయిలీ లిపిలో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకొని.. 2023లో కంప్యూటర్ పైనే పరీక్షలు రాసి 8.19 జిపిఏ పాయింట్లు తెచ్చుకొని సత్తా చాటారు. తనకు ఇష్టమైన న్యాయవిద్యలో పట్టా పొందారు.