Margadarshi Cae : ‘మార్గదర్శి’ అక్రమాల కేసులో ఏపీ సీఐడీ పట్టు బిగుస్తోంది. ఇప్పటికే కీలక ఆస్తులను అటాచ్ చేసిన సీఐడీ.. ఇప్పుడు మార్గదర్శిలో డిపాజిట్లు చేసిన నల్ల కుభేరుల జాబితాను బయటకు తీసే పనిలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది తమ నల్లధనాన్ని దాచుకునే వేదికగా మార్గదర్శిని మార్చుకున్నారని అనుమానిస్తోంది. అందుకే కోటి రూపాయలకుపైగా డిపాజిట్లు చేసిన వారిని గుర్తించింది. వారిని నోటీసులు అందిస్తోంది. అంత ధనం ఎలా అర్జించారు? వాటికి పన్నులు కట్టారా? లేదా? అన్న ఉక్కిరిబిక్కిరి ప్రశ్నలను సంధిస్తోంది. ఇప్పటివరకూ 800 మందికి నోటీసులు జారీచేసినట్టు తెలుస్తోంది. అయితే వీరి సంఖ్య వెయ్యి మందికి పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Margadarshi Case : మార్గదర్శిలో నల్లధనం.. వాళ్లందరికీ షాక్
ఏపీలో మార్గదర్శికి 37 బ్రాంచ్ లున్నాయి. కోటి రూపాయలకుపైగా డిపాజిట్ చేసిన 800 మందికి సీఐడీ నోటీసులిచ్చింది. డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఎలా ఆర్జించారు? మీ ఆదాయ మార్గాలేమిటో తెలపాలని నోటీసులో పేర్కొంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిబంధనలు పాటించారా? లేదా? చెప్పాలని మార్గదర్శి సంస్థకు సైతం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. మొత్తానికైతే సీఐడీ మార్గదర్శి విషయంలో మరింత శూలశోధనకు దిగడం ఆసక్తిగొల్పుతోంది. ఇంతమంది అంత భారీ స్థాయిలో మొత్తాన్ని మార్గదర్శిలో డిపాజిట్లు చేయడం అషామాషీ విషయం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి జాతీయ బ్యాంకులు సేవింగ్స్ డిపాజిట్లపై ఐదు శాతానికి పైగా వడ్డీ చెల్లిస్తాయి. కానీ మార్గదర్శి చెల్లిస్తోంది మాత్రం కేవలం 5 శాతమే. అయినా సరే ఇంత మొత్తంలో నిధులు మార్గదర్శిలో డిపాజిట్లు చేస్తున్నారంటే అదంతా నల్లధనమేనన్న అనుమానాలున్నాయి. అందుకే ఈ చిన్న పాయింట్ ను తీసుకొని మార్గదర్శి యాజమన్యాన్ని ఇరుకునపెట్టాలని సీఐడీ చూస్తోంది. జాతీయ బ్యాంక్ లో ఇంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలంటే తప్పనిసరిగా అన్ని వివరాలు నమోదుచేయాలి. పాన్, ఆధార్ అంటి అన్ని నంబర్లను పొందుపరచాలి. ఆర్బీఐ, ఆదాయపు పన్ను, సీబీడీటీ అధికారుల దృష్టిలో పడుతుంది. ఆ వివరాలేవీ బయటపెట్టలేని వారు మాత్రమే మార్గదర్శి వంటి సంస్థలో డిపాజిట్లు చేయగలరు.
గతంలో ఈ తరహా మోసం కేసులోనే సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతోరాయ్ కు జైలుశిక్ష పడింది. అక్రమ డిపాజిట్లు, డిపాజిటర్ల గోప్యత వంటి విషయంలోనే అప్పట్లో న్యాయస్థానం తప్పుపడుతూ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పుడు సీఐడీ దర్యాప్తులో సైతం సహారా ఇండియా తరహాలోనే అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో రామోజీ అండ్ కోలో ఆందోళన మొదలైంది. సీఐడీ 800 మంది డిపాజిటర్లకు నోటీసులిచ్చిన క్రమంలో మార్గదర్శి యాజమాన్యం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. తాము చిట్ ఫండ్స్, ఆదాయపు పన్ను చట్టాలను పాటిస్తున్నామని చెప్పింది. అయితే ఎక్కడ ఆర్బీఐ, సీబీడీటీ నిబంధనలు పాటిస్తున్నామని చెప్పలేకపోవడం గమనార్హం.