BJP And Jagan: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది కూటమి. అదే కూటమిపై విమర్శలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. కూటమిలో ఉన్న టిడిపి తో పాటు జనసేన పై విరుచుకుపడుతున్నారు. బిజెపి జోలికి మాత్రం వెళ్లడం లేదు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. ఏపీలో తమ ప్రత్యర్థిగా ఉన్న కూటమి బలపరిచిన అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించడం జాతీయస్థాయిలో కూడా చర్చ నడిచింది. అయితే జగన్మోహన్ రెడ్డి అలా మద్దతు తెలిపినందుకు బిజెపి నుంచి ఎవరు అభినందనలు తెలపలేదు. కానీ ఏపీ నుంచి మాత్రం బిజెపి మాజీ చీఫ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్రం జగన్మోహన్ రెడ్డిని వెనుకేసుకు రావడం విశేషం. జగన్మోహన్ రెడ్డిని ఆయన సోదరి షర్మిల ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారని అర్థం వచ్చేలా మాట్లాడారు. కేవలం జగన్ ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం వల్లే ఆమె రాజకీయంగా వ్యతిరేకించిన విషయాన్ని ప్రస్తావించారు.
Also Read: నేపాల్ లో 215 మంది ఏపీ పౌరులు.. రంగంలోకి లోకేష్
* చారిత్రాత్మక తప్పిదం.. ఉపరాష్ట్రపతి( Indian vice president) ఎన్నిక ముగిసింది. బిజెపి ప్రతిపాదించిన అభ్యర్థి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సుదర్శన్ రెడ్డి ఓడిపోయారు. అయితే దీనిని తప్పుపడుతున్నారు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడ్డారని జగన్మోహన్ రెడ్డి తీరును ఆక్షేపించారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన నేతను ఎన్నుకుంటారా అని నిలదీశారు. మరోవైపు పిసిసి చీఫ్ షర్మిల సైతం జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగు రాష్ట్రానికి చెందిన మాజీ న్యాయ కోవిదుడుని కాదని.. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తిని ఎన్నుకుని చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడ్డారని జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
* ఉండవల్లికి సవాల్..
అయితే ఆ ఇద్దరు నేతల ఆరోపణలపై స్పందించారు బిజెపి సీనియర్ నేత, ఏపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు( Somu Veer Raju) . అసలు మీకు ఆర్ఎస్ఎస్ గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు. తనతో డిబేట్ కు రావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కు సవాల్ చేశారు. ఆది నుంచి ఆర్ఎస్ఎస్ అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ కు పడదన్నారు. షర్మిలకు రాజకీయం తెలియదని.. సోదరుడు జగన్ ఆస్తిలో వాటా ఇచ్చి ఉంటే ఆమె జగన్ వెంటే నడిచేవారని చెప్పుకొచ్చారు. తద్వారా జగన్మోహన్ రెడ్డిని వెనుకేసుకొచ్చారు సోము వీర్రాజు. అయితే ఆయన కేవలం ఆర్ఎస్ఎస్ పై విమర్శలు చేయడం వల్లే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చి కౌంటర్ ఇచ్చారని ఆయన అభిమానులు చెబుతున్నారు. అంతకుమించి ఏమీ లేదని తేల్చేస్తున్నారు.
* వైసీపీకి అనుకూలముద్ర..
వైసిపి( YSR Congress ) హయాంలో ఏపీ బీజేపీ చీఫ్ గా ఉండేవారు సోము వీర్రాజు. ఆ సమయంలో వైసీపీకి ఫేవర్ గా ఉండే వారన్న ఆరోపణలు ఆయనపై ఉండేవి. తెలుగుదేశం పార్టీ అంటే అంత ఎత్తుకు దూసుకెళ్లేవారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని ప్రకటించేవారు. ఈ క్రమంలో ఆయన జగన్మోహన్ రెడ్డి మనిషి అనే అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే ఆయనను తప్పించి ఏపీ బీజేపీ చీఫ్ గా పురందేశ్వరి నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. కానీ సోము వీర్రాజుకు ఎక్కడ ఛాన్స్ దక్కలేదు. అయితే ఎమ్మెల్సీ పదవుల పంపకంలో బిజెపికి కేటాయించిన సీటును సోము వీర్రాజుకు ఇచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వీర్రాజు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. కృతజ్ఞతలు తెలిపారు. అటు తర్వాత సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థిస్తూ వచ్చారు. అటువంటి సోము వీర్రాజు ఇప్పుడు సడన్ గా జగన్ కు అండగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త చర్చకు దారితీసింది.