AP BJP
AP BJP: ఏపీ విషయంలో బిజెపి ఉద్దేశం ఏమిటి? కూటమిలోకి వస్తుందా? లేదా? అసలు తెలుగుదేశం పార్టీతో కలిసే ఉద్దేశం ఉందా? ఉంటే ఈ జాప్యానికి కారణమేంటి? బిజెపి వస్తుందని టిడిపి, జనసేన చెబుతోంది. బిజెపి అగ్ర నేతల నుంచి ఎటువంటి సంకేతాలు కనిపించడం లేదు. కనీసం చిన్న స్థాయి ప్రకటన కూడా రావడం లేదు. ఈ తరుణంలో ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు పరిధిలో ఎన్నికలకు సిద్ధమైనట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తాజాగా ప్రకటించడం విశేషం.దీంతో బిజెపి వైపు అనుమానపు చూపులు ప్రారంభమయ్యాయి. అసలు బిజెపి లేకుండా కీలకమైన అసెంబ్లీ సీట్లు విషయంలో చంద్రబాబు, పవన్ ల ప్రకటన బిజెపి అగ్ర నేతలకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. దీంతో ఇది పొత్తులకు ప్రశ్నార్థకంగా మారుతోంది.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. బిజెపి అగ్రనేతలను కలిశారు. కీలక చర్చలు జరిపారు. ఇది జరిగి దాదాపు నెల రోజులు అవుతుంది. కానీ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. అయితే బిజెపితో సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిందని.. ఆ పార్టీకి నాలుగు పార్లమెంట్ స్థానాలతో పాటు నాలుగు అసెంబ్లీ సీట్లు కేటాయిస్తారని ఎల్లో మీడియా కథనాలు రాస్తోంది. ఈ తరుణంలో పురందేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హై కమాండ్ పురందేశ్వరితో ఈ ప్రకటన చేయించిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీతో కలవడానికి బిజెపి అగ్ర నేతలు అంత సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ మరో భాగస్వామ్య పక్షం జనసేన ఒత్తిడి మేరకు బిజెపి అగ్రనేతలు తలొగ్గినట్లు తెలుస్తోంది. అయితే సీట్ల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా బిజెపి జనసేనకు దాదాపు 57 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయని అగ్రనేతలు అంచనా వేశారు. కానీ పవన్ మాత్రం 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలకు ఒప్పుకోవడా న్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నాలుగు పార్లమెంట్ స్థానాలతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలను బిజెపికి ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. అందుకే చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్లు సమాచారం. అందుకే బిజెపి అగ్రనేతలు రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో ఈ తరహా ప్రకటన చేయించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికైతే కూటమిలో సీట్ల సర్దుబాటు పీటముడి వీడడం లేదు. బిజెపి విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. దీంతో పొత్తుపై ఒక రకమైన గందరగోళం నెలకొంది.