YS Jaga :  జగన్ కు బిజెపి కొత్త శత్రువు..జాతీయస్థాయిలో ఇరుక్కున్న వైసీపీ.. లెక్క తప్పితే అంతే!

ఒక్కోసారి రాజకీయాల్లో అంచనాలు తప్పుతాయి. నిర్ణయాలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు జగన్ విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.

Written By: Dharma, Updated On : July 25, 2024 10:48 am
Follow us on

YS Jagan: జగన్ ఒత్తిడికి గురవుతున్నారు. ఏపీలో ఘోర పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. భవిష్యత్తు రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. కానీ ఎలా ముందుకెళ్లాలో ఆయనకు తెలియడం లేదు. ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్టు ఉంది పరిస్థితి. ఇప్పటివరకు బిజెపికి ఫేవర్ గా ఉండేవారు. బిజెపి సైతం ఫేవర్ చేసేది. కానీ ఇప్పుడు తాను ఆసక్తి చూపుతున్న బిజెపి పట్టించుకునే స్థితిలో లేదు. మధ్యలో ఇప్పుడు చంద్రబాబు వచ్చారు. పవన్ స్ట్రాంగ్ అయ్యారు. ఆ ఇద్దరూ ఇప్పుడు బిజెపికి అవసరం. అందుకే జగన్ సైతం పరిస్థితిని అర్థం చేసుకొని దూరం జరిగారు. అయితే ఏకంగా ఢిల్లీలో ధర్నా చేపట్టి ఇరుక్కుపోయారు. ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందన్న విషయాన్ని జగన్ మరిచిపోయారు. ఏకంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విధానాలపై పోరాడేందుకు ఢిల్లీని వేదికగా చేసుకున్నారు. అయితే ఢిల్లీ ధర్నాతో వైసిపి ఇరుక్కుపోయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ పరిస్థితి చూస్తుంటే బిజెపి దగ్గరకు వెళ్ళలేరు. అలాగని కాంగ్రెస్ కూటమికి దూరంగా జరగలేరు. బిజెపి దగ్గరకు వెళ్తే కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి పార్టీలు నమ్మవు. తాను కష్టాల్లో ఉన్నానని.. తనకు మద్దతు ఇవ్వాలని కోరిన వెంటనే ఇండియా కూటమి పార్టీలు వచ్చి సంఘీభావం తెలిపాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అనుమతి లేనిదే ఈ రాజకీయ పక్షాలు జగన్ కు కచ్చితంగా టచ్ లోకి రావు.కాంగ్రెస్ పార్టీ ఎలా ఆలోచిస్తుందో తెలియదు కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ మాత్రం ఇండియా కూటమి వద్ద ఉండడం గ్యారెంటీ. బిజెపి పెద్దలు ఆగ్రహించడం కూడా ఖాయం. ఢిల్లీలో ధర్నా తర్వాత రాజకీయ పరిస్థితులు సమూలంగా మారాయి. గత ఐదేళ్లుగా బిజెపితో కొనసాగించిన అనుబంధం తగదెంపులు చేసుకున్నట్లు అయింది. కొత్త శత్రువు రూపంలో బిజెపి మారింది. బిజెపి ప్రత్యర్థులతో జగన్ చేతులు కలిపి.. కేంద్ర పెద్దలకు శత్రువయ్యారు. మున్ముందు దాని ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. కేసుల రూపంలో జగన్ ను వెంటాడుతుంది.

* మిత్రులు దొరికారు సరే
జాతీయస్థాయిలో జగన్ కు కొత్త మిత్రులు దొరికారు. బలమైన రాజకీయ పక్షాలైన సమాజ్ వాది, తృణమూల్ కాంగ్రెస్ తో స్నేహం కుదిరింది. ఉద్ధవ్ ఠాక్రే రూపంలో స్నేహితుడు దొరికాడు. అయితే బిజెపికి వీరంతా ప్రత్యర్థులే. అన్నింటికీ మించి ఇండియా కూటమిలో పార్టీలు అవి. కచ్చితంగా కాంగ్రెస్ హస్తం ఉంటుందని బిజెపి అనుమానిస్తుంది. అందుకే జగన్ పై అక్రమాస్తుల కేసులతో పాటు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా తెరపైకి వస్తుంది. అయితే ఈ ఐదేళ్లలో ఎప్పటికైనా ఈ కేసులు తెరమీదకు రావడం సాధారణం. కానీ ఇంత తొందరగా రావడానికి మాత్రం జగన్ వైఖరి కారణం. బిజెపి ప్రత్యర్ధులతో చేతులు కలపడం ద్వారా.. అదే బిజెపికి శత్రువుగా మారారు జగన్.

* అంతు పట్టని కాంగ్రెస్ వ్యూహం
అయితే కాంగ్రెస్ వ్యూహం ఏంటన్నది తెలియడం లేదు. జగన్ ను నిర్వీర్యం చేయడానికా.. లేకుంటే అదే జగన్ ద్వారా కాంగ్రెస్ ని బలోపేతం చేయడానికా అన్నది తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ కు ఉమ్మడి రాష్ట్రంలో జగన్ చేసినంత ద్రోహం ఎవరూ చేయలేదు. కాంగ్రెస్ ఇచ్చిన పదవులతోనే విపరీతంగా సంపాదించి రాజకీయాల్లో బలమైన శక్తిగా మారారు. కాంగ్రెస్ బలాన్ని బలవంతంగా లాక్కున్నారు. అటువంటి జగన్ ను రాజకీయంగా దగ్గర చేసుకోవాలన్న కాంగ్రెస్ ఉద్దేశం వెనుక చాలా రకాల వ్యూహాలు ఉంటాయి.

* అన్ని ఆయుధాలతో ఎన్డీఏ
ప్రస్తుతం ఎన్డీఏలో చంద్రబాబు కీలక భాగస్వామి. టిడిపి మద్దతుతోనే మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రాగలిగింది. అందుకే చంద్రబాబు సూచన మేరకు ఎన్డీఏ జగన్ విషయంలో పట్టు బిగించడం ఖాయం. జగన్ రాజకీయ భవిష్యత్తు అనేది ప్రశ్నార్ధకం చేయడానికి కావలసిన ఆయుధాలు అన్ని ఎన్డీఏ వద్ద ఉన్నాయి. తప్పకుండా తనను ఇబ్బంది పెడతారని జగన్ కు తెలుసు. ఆ అంచనా తోనే జాతీయస్థాయిలో వేధింపులు అని ప్రచారం చేసుకోవడానికి కొన్ని పార్టీల మద్దతు అనివార్యం. ఒకవేళ స్పీకర్ పదవికి మద్దతు మాదిరిగా.. రాజ్యసభలో బిజెపి ప్రవేశపెట్టి బిల్లులకు వైసీపీ మద్దతు తెలిపితే మాత్రం.. జగన్ క్యారెక్టర్ లెస్ అంటూ ముద్ర పడే అవకాశం ఉంది. జాతీయస్థాయిలో పట్టించుకునే పార్టీలు కూడా ఉండవు. అందుకే ఇప్పుడు జగన్ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిణామం జరుగుతుందోనని భయపడుతున్నారు.