Nature cultivation : 2025 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ .1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో పెట్టిన బడ్జెట్ లో ప్రకటించారు. ఇది మొత్తం బడ్జెట్ వ్యయంలో రూ. 48.2 లక్షల కోట్లలో 3.1%. సవరించిన అంచనా (ఆర్ఈ, FY24)లో రూ. 1.4 లక్షల కోట్లతో పోలిస్తే స్వల్ప పెరుగుదల మాత్రమే. ఇది ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేయదు. వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిచయం చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే 2025 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీ కోసం రూ. 1.64 లక్షల కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఇది కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ సబ్సిడీ కేటాయింపు 2025 ఆర్థిక సంవత్సరంలో సాగు, అనుబంధ రంగాలకు కేటాయింపులను మించిపోయింది. ఈ వ్యత్యాసం ఎరువుల సబ్సిడీపై విమర్శలకు దారి తీస్తోంది. స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, గ్రాన్యులర్ ఎరువులు, యూరియాకు సబ్సిడీ ఇవ్వడం మధ్య ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇది నేల ఆరోగ్యంపై కూడా కొంత ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ప్రస్తుతం పొలాల్లో వాడుతున్న గ్రాన్యులర్ యూరియాను పంటలకు పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం గమనార్హం. నత్రజని యూరియాలో 35% మాత్రమే పంటల ద్వారా గ్రహించబడుతుందని పోషక వినియోగ సామర్థ్యం (ఎన్యుఈ) అంచనాలు సూచిస్తున్నాయి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల యూరియాలో ఎక్కువ భాగం అమ్మోనియా (ఎన్ హెచ్ 3), నైట్రోజన్ గ్యాస్ (ఎన్ 2), నైట్రస్ ఆక్సైడ్ (ఎన్ 2ఓ) వాయువులుగా మారుతుంది. అమ్మోనియా, ఆక్సీకరణం తర్వాత నైట్రేట్ (ఎన్ఓ 3) గా మారుతుంది. ఇది కార్బన్ సమానత్వానికి 273 రెట్లు, గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతుంది. అంతే కాకుండా ఎరువుల నత్రజనిలో కొంత భాగం భూగర్భ జలాల్లో కలిసిపోయి నైట్రేట్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆ జలాలు తాగేందుకు పనికిరాకుండా పోతాయి.
1970వ దశకంలో ఎరువుల సబ్సిడీని ప్రవేశపెట్టిన సమయంలో ధాన్యం దిగుబడి, ఎరువుల వాడకం నిష్పత్తి 10:1గా ఉండేది. కాలక్రమేణా ఈ నిష్పత్తి 2:1 కు పడిపోయింది. ప్రత్యామ్నాయాలను ఎందుకు అన్వేషించడం లేదన్న ప్రశ్న ఇక్కడ మెదులుతుంది. ఎందుకంటే ఎరువుల సబ్సిడీని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ నుంచి వ్యవసాయ మంత్రిత్వ శాఖకు బదిలీ చేసి రైతులకు నేరుగా పంపిణీ జరిగేలా చూడాలి. ఈ చర్య, నిర్ధిష్ట ఎరువుల ధరల నియంత్రణను తొలగించడంతో కలిపి, సమానమైన ధర, వినియోగాన్ని ప్రోత్సహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది సబ్సిడీల్లో ఆదాకు దారితీస్తుంది.
రిజిస్ట్రర్డ్ అగ్రి ఇన్ పుట్ డీలర్ల నుంచి ఎరువులను కొనేందుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ వోచర్లు లేదా కూపన్లను అందించడం ద్వారా పంపిణీ ప్రక్రియను డిజిటలైజ్ చేయడాన్ని ఆర్థిక మంత్రి పరిశీలించవచ్చు. దీనివల్ల బ్లాక్ మార్కెట్ ఉండదు.
2024 ఆర్థిక సర్వే ఎరువుల సంస్కరణ ఆవశ్యకతను నొక్కి చెప్పింది. రెండు కీలక విధాన సిఫార్సులను సమర్పించింది. ఎరువుల సబ్సిడీల లక్ష్యాన్ని పెంచేందుకు ప్రధాన రాష్ట్రాల్లో స్థాపించిన డిజిటల్ ప్లాట్ఫామ్ అగ్రి స్టాక్ ను ఉపయోగించుకోవడం. అగ్రి స్టాక్ అర్హత కలిగిన రైతులను గుర్తించడం, భూమి యాజమాన్యం, ప్రాథమిక పంటల ఆధారంగా ఎరువుల అవసరాలకు వీలు కల్పిస్తోంది.
రెండోది ఈ-కూపన్ల తరహాలో ఫ్లెక్సిబుల్ ఇన్ పుట్ సబ్సిడీలను నేరుగా రైతుల రిజిస్టర్డ్ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసేందుకు ఈ-రూపీని అవలంభించడం. అధీకృత పీఓఎస్ యంత్రాలను ఉపయోగించి రైతులు అధీకృత దుకాణాల నుంచి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు వంటి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
ఈ సంస్కరణలు విజయవంతం కావాలంటే రైతుల ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతాలు వంటి ధ్రువీకరణ పత్రాలను వారి ఆధీనంలో ఉన్న అన్ని వ్యవసాయ భూములతో అనుసంధానం చేయడం చాలా అవసరం.