https://oktelugu.com/

AP Elections 2024: ఏపీలో ఆ ఎంపీ స్థానాలపై బీజేపీ గురి

తాజాగా ప్రధాని మోదీ ఏపీలో అడుగుపెట్టనున్నారు. ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు అయింది. 6, 8 తేదీల్లో నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రధాని పర్యటన కొనసాగనుంది.

Written By:
  • Dharma
  • , Updated On : May 5, 2024 / 11:31 AM IST

    AP Elections 2024

    Follow us on

    AP Elections 2024: ఏపీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గడువు సమీపిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ప్రచారాన్ని విస్తృతం చేశాయి. వైసిపి 175 అన్న నినాదంతో ముందుకెళ్తోంది. 2019 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తోంది. అందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. కూటమి తరుపున చంద్రబాబు, పవన్, పురందేశ్వరి విస్తృత ప్రచారం చేస్తున్నారు. వైసిపి దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్నారు.జనసేన తరఫున సినీ నటులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు.

    తాజాగా ప్రధాని మోదీ ఏపీలో అడుగుపెట్టనున్నారు. ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు అయింది. 6, 8 తేదీల్లో నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రధాని పర్యటన కొనసాగనుంది. రోడ్డు షో లతోపాటు భారీ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొనున్నారు. అయితే బిజెపి అభ్యర్థులు పోటీ చేస్తున్న మూడు పార్లమెంట్ స్థానాల్లో ప్రధాని మోదీ పర్యటిస్తుండడం విశేషం.

    రాజమండ్రి నుంచి పురందేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 6న ఆ రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. మరోవైపు రాజంపేట నుంచి బిజెపి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 8వ తేదీన ఆ పార్లమెంట్ సీటు పరిధిలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. అదే రోజు విజయవాడలో జరిగే రోడ్ షోలో సైతం ప్రధాని పాల్గొంటారు. అక్కడ టిడిపి అభ్యర్థి కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు. మరోవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా సుజనా చౌదరి కూడా బరిలో ఉన్నారు.

    గత నెలలో చిలకలూరిపేట బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అటు తరువాత ఇప్పుడే ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. అయితే బిజెపి పోటీ చేస్తున్న ఆరు పార్లమెంట్ స్థానాలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కచ్చితంగా నాలుగు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అరకు ఎస్టీ నియోజకవర్గం నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురందేశ్వరి, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ,రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇందులో కనీసం నాలుగు స్థానాలు అయినా దక్కాలని బిజెపి బలమైన ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ నియోజకవర్గాల్లో బిజెపి బలం అంతంత మాత్రమే. దీంతో ఇక్కడ టిడిపి జనసేన కేడరే దిక్కు. అందుకే ప్రధాని సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏపీ పర్యటనకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రధాని పర్యటనతో కూటమికి గేమ్ చేంజర్ అవుతుందని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి.