AP BJP: ఏపీలో బిజెపి పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి వస్తోంది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కేంద్ర పెద్దలతో నేరుగా మాట్లాడుతున్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నారు. అటు పవన్ సైతం బిజెపి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కానీ, రేపు కానీ పొత్తుపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.అయితే బిజెపి ఆశిస్తున్నట్లు సీట్లు దక్కే అవకాశం లేనట్లు టిడిపి అనుకూల జర్నలిస్టులు ప్రచారం చేస్తున్నారు. అనుకూల మీడియా సైతం ఇదే తరహా ప్రచారం చేయడం విశేషం. జనసేనకు ఇచ్చిన సీట్లను కలుపుకొని పొత్తుల లెక్కలు చూపుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే బిజెపికి మరో ఆరు వరకు అసెంబ్లీ, ఐదు వరకు పార్లమెంట్ స్థానాలు కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రెండు పార్టీలకు 30 అసెంబ్లీ సీట్లు, 8 వరకు పార్లమెంట్ స్థానాలను విడిచి పెట్టేందుకు టిడిపి అంగీకారం తెలిపినట్లు టాక్ నడుస్తోంది. వాటినే ఒక మ్యాజిక్ ఫిగర్ గా చూపించేందుకు టిడిపి అనుకూల మీడియా తెగ ఆరాటపడుతోంది. వాటికి మించి సీట్లు ఇస్తే అది అంతిమంగా వైసిపికి ప్రయోజనం చేకూర్చినట్టేనని ఆ సెక్షన్ ఆఫ్ మీడియా భావిస్తుండడం విశేషం.
అయితే తెలుగుదేశం పార్టీతో కలిసేందుకు బిజెపి పెద్దలు ఇష్టపడడం లేదని ఇన్ని రోజులు ప్రచారం జరిగింది. పొత్తులో భాగంగా సింహభాగం ప్రయోజనాలు దక్కితేనే ఆలోచిస్తామని ఇన్నాళ్లు బిజెపి పెద్దలు చెప్పుకొచ్చారు.అయితే ఇంత తక్కువ సీట్లు తీసుకుంటే మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికరమే.జనసేన కంటే పార్లమెంట్ స్థానాల విషయంలో అధికంగా ఉన్నా.. అసెంబ్లీ స్థానాలు తక్కువగా ఇవ్వడాన్ని మాత్రం బిజెపి శ్రేణులు తప్పుపడుతున్నాయి. ఒక జాతీయ పార్టీగా బిజెపిని గుర్తించకుండా అవమాన పరుస్తున్నారని బిజెపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితేఈ సీట్లకు అంగీకారం తెలిపితే మున్ముందు చంద్రబాబు బిజెపిని తక్కువగా చూపే ప్రయత్నం చేస్తారని అనుమానిస్తున్నారు.అందుకే సీట్ల విషయంలో సీరియస్ గా ఆలోచించాలని కోరుతున్నారు.