Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టులో బిగ్ ట్విస్ట్. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవాడలోని సిఐడి కోర్టులో కేసుకు సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. తన వాదనను పరిగణలోకి తీసుకోవాలని చంద్రబాబు న్యాయమూర్తిని కోరారు. దీనికి అంగీకరించడంతో చంద్రబాబు తన వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో తనకు అసలు సంబంధం లేదు అని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాజకీయ కక్షతోనే తనను అరెస్ట్ చేసిన విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.
అంతకుముందు సిఐడి రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. అందులో చంద్రబాబును ఏ 37 గా చూపించడం విశేషం. తొలుత ఈ కేసులో చంద్రబాబు ఏ 1 అని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే సిఐడి హడావిడి చేసింది. వాస్తవానికి 2021 లోనే సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అందులో చంద్రబాబు పేరు లేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. కోర్టుకు హాజరయ్యే క్రమంలోనే ఆయన పేరును చేర్చింది. ఏ 37 గా చూపించింది. ఏ 1 గా గంటా సుబ్బారావు పేరుని చేర్చారు. అయితే నిధుల మళ్లింపు పై అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని సిఐడి అపవాదు మోపింది.
ప్రస్తుతం కేసుకు సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూధ్ర వాదిస్తున్నారు. సిఐడి తరఫున అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. సిఐడి చంద్రబాబును 15 రోజులు కస్టడీ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిన కేసని చంద్రబాబు తరపు న్యాయవాది బలమైన వాదన వినిపిస్తున్నారు. దీనిపై మరికొద్ది సమయంలో తీర్పు వెలువడే అవకాశం ఉంది. అటు విజయవాడ కోర్టు ప్రాంగణం టిడిపి శ్రేణులతో నిండిపోయింది. వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారుతుంది.