ABN RK : మీడియా అనేది పక్షపాతంగా ఉండకూడదు.. ఒక పార్టీకి డప్పు కొట్టకూడదు. ఆ పార్టీ రంగును భుజాన వేసుకుని మోయకూడదు. నమస్తే తెలంగాణ అది భాజప్తుగా కెసిఆర్ పత్రిక. అది భారత రాష్ట్ర సమితికి సంబంధించిన వార్తలు మాత్రమే రాస్తుంది. గిట్టని వాళ్ళ మీద బురద చల్లుతుంది. జగన్ సాక్షి కూడా అంతే. మరి ఆంధ్రజ్యోతి? ఈనాడు? పాత్రికేయ ప్రమాణాలు పాదుకొల్పే విషయంలో తాము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని చెప్పే వీటి ఓనర్లు చేస్తున్నది ఏమిటి? నిన్న చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత ఈనాడు, జ్యోతి ఏ స్థాయిలో గొంతు చించుకున్నాయో తెలుగు పాఠకులకు మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి తెలుసు. లోతుల్లోకి వెళ్లడం లేదు గాని.. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో కొత్త పలుకు పేరిట దాని ఓనర్ వేమూరి రాధాకృష్ణ రాసిన ఎడిటోరియల్ ఆర్టికల్ చదివితే.. ఏ స్థాయిలో పసుపు రంగు ఒంట పట్టించుకున్నాడో ఇట్టే అర్థమవుతుంది.
జగన్ అక్రమాస్తుల కేసులో నాడు సోనియాగాంధీ పట్టుదలతో ఉన్నారు. సిబిఐ తన పెంపుడు చిలకే కాబట్టి జగన్ మీదికి ఉసిగొలిపారు. ఈ కేసులో నాడు చంద్రబాబు నాయుడు కూడా ఇంప్లిడ్ అయ్యాడు కాబట్టి జగన్ జైలుకు వెళ్ళాడు. 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీదకు వచ్చింది. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సిబిఐకి వ్యతిరేకంగా ధర్నాలు చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి అచ్చు వేసిన వార్తలు మరొక ఎత్తు. జగన్ మీద పుంఖాలుగా వార్తలు రాశాయి. కుటుంబ సభ్యుల వ్యవహారాలను కూడా పత్రికలోకి తీసుకొచ్చాయి. మరి అలాంటప్పుడు జగన్ కళ్ళు కసితో ఉండవా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వల్ల అవినీతి అంతం అని రాసుకొచ్చిన వేమూరి రాధాకృష్ణ.. ఇప్పుడు కసి అని మాట్లాడటం లో ఆంతర్యం ఏమిటి? అంటే చంద్రబాబు ఎలాంటి అక్రమాలు చేసిన పట్టించుకోవద్దని సర్టిఫికెట్ ఇస్తున్నాడా? బాబు సర్వ పరిత్యాగి అని లోకానికి చాటింపు వేద్దామనుకుంటున్నాడా? న్యాయం ఏమిటి అన్యాయం ఏమిటి అనేవి కోర్టులో తేలుతాయి కదా? అరెస్టు చేసినప్పుడు ఇంత గందరగోళానికి తెరలేపడడానికి కారణం ఏమై ఉంటుంది?
రాధాకృష్ణ రాసుకొచ్చిన్నట్టు జగన్ కళ్ళు ఇప్పుడు చల్లబడి ఉంటాయి కావచ్చు. జగన్ ఇప్పుడు మనశ్శాంతిగా ఉంటాడు కావచ్చు. జగన్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకొని ఉంటారు కావచ్చు. మరి ఒకప్పుడు వీరు చేసింది ఏమిటి? ఒకప్పుడు రాధాకృష్ణ రాసింది ఏమిటి? జగన్ అవినీతి చేసినప్పుడు తాటికాయంత అక్షరాలతో వార్తలు రాసినప్పుడు.. ఇప్పుడు కూడా అదే ఫాలో అవ్వాలి కదా? అలా కాకుండా అడ్డగోలు అరెస్ట్ అని రాయడం వెనుక ఆంతర్యం ఏమిటి? 21 లో కేసు నమోదు చేసినప్పుడు 23లో అరెస్టు చేయడం ఏంటి అని రాధాకృష్ణ ప్రశ్నించారు? జగన్ విషయంలోనూ ఇదే జరిగింది కదా. అప్పటికప్పుడు కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయలేదు కదా? చంద్రబాబు నాయుడు ని మాత్రమే అరెస్టు చేసి.. నాడు సంబంధిత శాఖ కార్యదర్శిగా సంతకాలు చేసిన ప్రేమ చంద్రారెడ్డిని ముద్దాయిగా ఎందుకు పేర్కొనలేదు అని రాధాకృష్ణ ప్రశ్నించారు. కానీ ఇక్కడ ఆయనే అందులో అవకతవకలు జరిగాయని ఒప్పుకున్నారు. ఏ_1 ను పట్టుకున్నప్పుడు.. ప్రేమ చంద్రారెడ్డిని అరెస్టు చేయడం ఏపీ పోలీసులకు ఒక లెక్కా? చంద్రబాబు ఈ వ్యవహారంలో ముడుపులు తీసుకున్నారని సిఐడి ఆరోపిస్తున్నప్పుడు.. దానికి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయని వారు చెబుతున్నప్పుడు.. ప్రేమ చంద్రారెడ్డి మీద ఎందుకు కేసు నమోదు చేస్తారు? ఇంత చిన్న లాజిక్ రాధాకృష్ణ ఎలా మిస్ అయ్యాడు.. ఏంటో ఒకప్పుడు నిప్పులు చిమ్మేలాగా ఉన్న రాధాకృష్ణ రాతలు.. ఇప్పుడు పూర్తిగా పసుపు రంగు పూసుకున్నాయి..