AP Election Survey: ఏపీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటన వచ్చింది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీ దూకుడు మీద ఉంది. దాదాపు 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు జగన్ అభ్యర్థులను ప్రకటించారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమికట్టాయి. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. కానీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు జరుగుతోంది. వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రకటించాలని ఆ మూడు పార్టీలు ప్రయత్నాలు ఉన్నాయి. మరోవైపు ఎన్నికలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని వెల్లడించే పనిలో సర్వే సంస్థలు పడ్డాయి. ఇప్పటివరకు జాతీయ సర్వే సంస్థలు, మీడియా చానళ్లు సర్వేలను వెల్లడించాయి. ఇప్పుడు తెలుగు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. తాజాగా బిగ్ టీవీ సర్వే వివరాలను వెల్లడించింది. ఏపీలో విజేతలను తేల్చింది.
ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 మధ్య మూడ్ ఆఫ్ ఆంధ్ర పేరిట 175 నియోజకవర్గాల్లో బిగ్ టివి సర్వే చేపట్టినట్లు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడంతో ఈ సర్వేలో ఆ పార్టీ ప్రభావం పై అభిప్రాయ సేకరణ జరపలేదు. వైసిపి ఒకవైపు.. టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఒకవైపు బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలుగు చూశాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూటమి ఐదు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. వైసిపి మూడుచోట్ల విజయం సాధించే ఛాన్స్ కనిపిస్తోంది. రెండు చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది. విజయనగరంలో కూటమి నాలుగు, వైసీపీ నాలుగు చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది. ఒకచోట మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది. విశాఖ జిల్లాలో కూటమి ఏడు, వైసిపి ఐదు చోట్ల గెలుపొందుతుంది. మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో కూటమి 7, వైసిపి ఐదు చోట్ల గెలుపొందే అవకాశం ఉంది. ఏడు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లాలో కూటమి 9చోట్ల, వైసీపీ రెండు చోట్ల గెలుపొందుతుంది. నాలుగు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది.
కృష్ణాజిల్లాలో కూటమి 9చోట్ల, వైసీపీ నాలుగు చోట్ల గెలుపొందుతుంది. మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది. గుంటూరు జిల్లాలో కూటమి 11చోట్ల, వైసీపీ రెండు చోట్ల గెలుపొందే ఛాన్స్ ఉంది. నాలుగు చోట్ల టఫ్ ఫైట్ నడవనుంది. ప్రకాశం జిల్లాలో కూటమి ఆరు చోట్ల, వైసిపి మూడు చోట్ల గెలిచే ఛాన్స్ ఉంది. మరో మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది. నెల్లూరు జిల్లాలో కూటమి నాలుగు చోట్ల, వైసీపీ నాలుగు చోట్ల గెలుపొందుతుంది. రెండు చోట్ల ఫైట్ ఉండనుంది.
చిత్తూరు జిల్లాలో కూటమి ఏడు చోట్ల, వైసిపి ఆరుచోట్ల గెలుపొందే ఛాన్స్ ఉంది. ఒకచోట గట్టి ఫైట్ నడవనుంది. కడప జిల్లాలో కూటమి రెండు చోట్ల, వైసిపి నాలుగు చోట్ల గెలుపొందనుంది. నాలుగు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది. కర్నూలు జిల్లాలో కూటమి నాలుగు చోట్ల, వైసీపీ 8 చోట్ల గెలుపొందే అవకాశం ఉంది. రెండు చోట్ల ఫైట్ నడవనుంది. అనంతపురం జిల్లాలో కూటమి ఆరుచోట్ల, వైసీపీ మూడు చోట్ల గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది.
ఏపీలో మొత్తం 175 స్థానాలకు గాను టిడిపి, జనసేన, బిజెపి కూటమికి 81, వైసిపికి 53 స్థానాలు తగ్గే అవకాశం ఉంది. 41 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని బిగ్ టీవీ సర్వేలో తేలింది.