Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి( bhogapuram International Airport ) సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు పౌర విమానం శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. మరో ఆరు నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుందని.. విమాన రాకపోకలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. 2026లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే. అయితే ఇప్పుడు ఏకంగా మే నెలలోనే తొలి విమానం ఎగర పోతుందని ప్రకటించారు మంత్రి. ప్రస్తుతం ఏయిర్పోర్ట్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వీలైనంత త్వరగా మిగిలిన పెండింగ్ పనులు పూర్తిచేసి తొలి విమానాన్ని ఎగురవేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి జూన్లో విమాన రాకపోకలు ప్రారంభం అవుతాయని చెప్పుకొచ్చారు. కానీ ఒక నెల ముందుగానే విమాన సేవలను అందుబాటులోకి తెస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు.
– మరోవైపు ట్రయల్ రన్ కు సంబంధించి తొలి విమానం ఎగరబోతోంది భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరోవైపు విమానాశ్రయ నిర్మాణ పనులు దాదాపు 92 శాతం పూర్తయ్యాయి. మిగతా ఎనిమిది శాతం పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి విమాన సర్వీసులను ప్రారంభించాలన్నది పౌర విమానయాన శాఖ ప్రణాళిక. ఎప్పటికీ 5000 మందికి పైగా ఇంజనీర్లు, కార్మికులు పనులు చేస్తున్నారు.
– ఇటీవల విశాఖలో పెట్టుబడుల సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో టూరిజం, హోటల్స్ రంగాలకు సంబంధించిన చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
– కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభం అయ్యాయి. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టారు.
– దేశంలో ఎక్కడా లేనివిధంగా 3.8 కిలోమీటర్ల రన్వే నిర్మాణం ఈ విమానాశ్రయం ప్రత్యేకత.
– మత్స్య ఆకారంలో ఎయిర్ పోర్టు నిర్మాణం చేపడుతున్నారు. ఎగిరే విమాన ఆకారంలో సైతం ఉండనుంది.
– ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నిర్మాణాలు, ఇంటీరియర్ డిజైన్ చేశారు.
– దేశంలోనే అత్యాధునికమైన విమానాశ్రయాలుగా గుర్తింపు పొందిన ముంబై, నోయిడా ఎయిర్పోర్టుల తరహాలో ఉంటుంది భోగాపురం విమానాశ్రయం.
– ఏడాదికి 3.5 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే వీలుగా దీనిని రూపొందిస్తున్నారు.