Bharathi Reddy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో జగన్ తరువాత ఎవరు? అధినేత తరువాత స్థానం ఎవరిది? జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచేది ఎవరు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసిపి ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక వలయం పనిచేసింది. విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఇలా ఒక రక్షణ వలయం ఉండేది. కానీ ఇప్పుడు కొందరు నేతలు పార్టీకి దూరమయ్యారు. మరికొందరు కేసుల్లో చిక్కుకొని జైలు పాలు అయ్యారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు ఉన్నా.. జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులకు నియమించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మారిన రాజకీయ పరిస్థితులు, ముసురుకొస్తున్న కేసులు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి ముందు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తన భార్య భారతి రెడ్డిని రాజకీయాల్లోకి తేవాలని.. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
* చెల్లి తో పాటు తల్లి దూరం..
వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లోకి రాలేదు. ముఖ్యంగా కుటుంబంలో మహిళలు రాజకీయాలకు దూరంగా ఉండేవారు. కానీ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో.. జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడేందుకు ముందుకు వచ్చారు తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల. కొడుకు కోసం పులివెందులలో పోటీ చేశారు విజయమ్మ. కాంగ్రెస్ అధినాయకత్వంతో విభేదించి మరి రంగంలోకి దిగారు. చెల్లెలు షర్మిల అయితే ఊరు వాడ ప్రచారం చేశారు. అన్న జగన్మోహన్ రెడ్డి కోసం ఏకంగా పాదయాత్ర చేశారు. తన అన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు పరితపించారు. కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి తల్లి, చెల్లి ఇద్దరూ దూరమయ్యారు.
* ఒక్కొక్కరూ దూరం కావడంతో..
జగన్మోహన్ రెడ్డితో( Y S Jagan Mohan Reddy ) సుదీర్ఘకాలం ప్రయాణం చేశారు విజయసాయిరెడ్డి. రాజకీయాల్లోకి రాకమునుపే జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలు కొనసాగించేవారు. ఈ క్రమంలోనే జగన్ అవినీతి కేసుల్లో విజయసాయిరెడ్డి కూడా 16 నెలలు పాటు జైల్లో ఉండి పోయారు. వైసిపి ఆవిర్భావంలో విజయసాయిరెడ్డి పాత్ర కీలకం. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అన్ని విధాల కృషి చేశారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే క్రమంలో విజయసాయిరెడ్డి చేసే కృషి అంతా అంతా కాదు. అటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరోవైపు బాబాయ్ వైవి సుబ్బారెడ్డి యాక్టివ్ గా లేరు. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం అరెస్ట్ అవుతారని ప్రచారం నడుస్తోంది. ఇటువంటి సంక్లిష్ట సమయం కొనసాగుతున్న నేపథ్యంలో.. తనకు అండదండగా నిలిచేందుకు తన భార్య భారతి రెడ్డిని జగన్ రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారతి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో తరచూ ఫోన్లో మాట్లాడుతూ పార్టీ స్థితిగతులను తెలుసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.