Nara Lokesh: తిరుమలలో( Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. దసరా సెలవుల ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా టీటీడీ సరికొత్త టెక్నాలజీని ఉపయోగించనుంది. భక్తుల రద్దీని తగ్గించడానికి, వసతి, భద్రతను పెంచేందుకు ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. రేపు సీఎం చంద్రబాబు ఆ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గా గుర్తింపు పొందనుంది. కొంతమంది ప్రవాస భారతీయుల సాయంతో వైకుంఠం 1 లో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని నియంత్రిస్తారు. వసతి తో పాటు భద్రతను మెరుగుపరుస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అందుబాటులోకి వస్తోంది. ఇప్పుడు టీటీడీ భక్తుల సౌకర్యార్థం అదే సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు కానుండడం విశేషం.
* బహుళ ప్రయోజనాలు..
ఈ సరికొత్త టెక్నాలజీ తిరుమలలో భక్తుల రద్దీ ని అంచనా వేస్తుంది. భక్తుల రద్దీని అంచనా వేయడం, ఫేస్ రికగ్నేషన్( face recognition ) ద్వారా గుర్తింపు, సైబర్ దాడులను అడ్డుకోవడం వంటి చర్యలను దీని ద్వారా తీసుకుంటారు. 25 మందికి పైగా సిబ్బంది సి సి ఫుటేజీలను పర్యవేక్షిస్తూ.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తారు. అలిపిరి నుంచే ఏఐ సాంకేతికతతో భక్తుల రద్దీని అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో ఎంతమంది ఉన్నారు? ఎంత సమయం వేచి ఉన్నారు? సర్వదర్శనం పరిస్థితి ఏమిటి? అనే విషయాలను ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రాప్తి చేస్తుంది. మరోవైపు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో భక్తులను సైతం గుర్తుపట్టవచ్చు. చోరీలతో పాటు ఇతర నేర నియంత్రణలో కూడా ఇది ఎంతగానో సహకరిస్తుంది.
* ఎన్నారైల సహకారంతో..
ఇకనుంచి తిరుమలలో క్యూ లైన్లు, వసతి వంటి సౌకర్యాలను త్రీడీ మ్యాప్ ల ( 3D map) ద్వారా చూపిస్తారు. రద్దీగా ఉండే ప్రాంతాలను రెడ్ స్పాట్స్ ద్వారా గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటారు. ఆన్లైన్లో వచ్చే సైబర్ దాడులను ఇట్టే అడ్డుకోగలరు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని, సమాచారాన్ని కూడా నియంత్రిస్తారు. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని దర్శనాన్ని మరింత సులభతరం చేయడానికి ఈ టెక్నాలజీని వాడనున్నారు. అయితే ఈ ఇంటిగ్రేటెడ్ కమాండింగ్ సిస్టం అందుబాటులోకి రావడం వెనుక మంత్రి లోకేష్ కృషి ఉంది. గత ఏడాది అక్టోబర్లో మంత్రి లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలోనే కొందరు ఎన్నారైలు ఈ విధానం గురించి చెప్పారు. తిరుమలలో ఏర్పాటుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఇప్పుడు అది ఏర్పాటు కావడంతో భక్తులు ఆనందిస్తున్నారు. ఈ విషయంలో లోకేష్ ప్రత్యేకంగా అభినందనలు అందుకుంటున్నారు.