Bharat Ratna for NTR: నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ).. అలియాస్ ఎన్టీఆర్. దేశ రాజకీయాల్లో ఒక యోధుడు. దేశ రాజకీయాల గతిని మార్చిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీ అధిపత్యాన్ని ప్రశ్నించిన నేత. ఒక విధంగా చెప్పాలంటే దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తెచ్చింది ఎన్టీఆర్. అటువంటి నేతకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉన్నా.. సాధ్యం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దశాబ్దాలుగా ఇది హామీగానే మిగిలిపోతోంది. తాజాగా ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇచ్చేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. అయితే టిడిపి కీలక భాగస్వామిగా ఉండి ఓవైపు రాష్ట్ర ప్రయోజనాలు, మరోవైపు రాజకీయ ప్రయోజనాలు పొందుతున్న క్రమంలో.. నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వకపోవడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది.
దశాబ్దాలుగా డిమాండ్..
నందమూరి తారక రామారావు మరణించి మూడు దశాబ్దాలు అవుతోంది. అప్పటినుంచి ఆయనకు భారతరత్న( Bharat Ratna) ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తూనే ఉంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ సహకారంతో కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాలు కూడా నడిచాయి. 1999లో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామి. 2014లో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏలో చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి చేరింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఎన్డీఏ మూడోసారి వరుసగా అధికారంలోకి రావడానికి కారణమైంది తెలుగుదేశం. అటువంటి కీలక భాగస్వామ్య పార్టీ ఆవిర్భావకుడు ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించకపోవడం ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
ఆ ఒక్క కారణంతోనే?
అయితే ప్రస్తుతం ఎన్డీఏలో( NDA) టిడిపి కీలక భాగస్వామి. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన చాలామంది నేతలకు ఎన్డీఏ ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. కానీ ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికి మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి ఉన్నారు. ఆమె ఏపీ బీజేపీ చీఫ్ గా కూడా వ్యవహరించారు. బిజెపి పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఆమె సైతం తన తండ్రి కి భారతరత్న అవార్డు ఇవ్వడంపై అనేక రకాల ప్రకటనలు చేశారు. కానీ దశాబ్దాలు దాటుతున్నా ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించలేదు. అయితే భారతరత్న ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా లక్ష్మీపార్వతి కారణమని ప్రచారం జరుగుతోంది. భారతరత్న ఇవ్వాలంటే.. చనిపోయిన వ్యక్తి భార్యకు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబం ఆలోచనలో పడినట్లు చాలా రకాలుగా విశ్లేషణలు వచ్చాయి. అందుకే ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.