Bandi Sanjay: చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రంలోని బిజెపిపై అనుమానాలు ఉన్నాయి. ఢిల్లీ పెద్దల సహకారం, సూచనలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేస్తారా? అంతటి సాహసం చేయగలరా? అన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తిరిగి అదే బిజెపి ఇప్పుడు జగన్ పై అనుమానం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు అరెస్టు వెనుక.. ఏపీ బీజేపీపై కుట్ర జరిగిందనిఆ పార్టీ జాతీయ కార్యదర్శి, పార్టీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.
సరిగ్గా జి20 శిఖరాగ్ర సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమవుతాయనగా.. వైసిపి సర్కార్ చంద్రబాబును అరెస్టు చేసింది. అర్ధరాత్రి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించింది. అప్పటినుంచి చంద్రబాబు అరెస్ట్ తెలుగు మీడియా ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో జీ 20 శిఖరాగ్ర సమావేశం ప్రాధాన్యత తగ్గింది. తెలుగు మీడియాలో కనీస కవరేజీ లేకుండా పోయింది. ఇది ముమ్మాటికీ వైసీపీ సర్కార్ కుట్రేనని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం.. ఈ తరహా కుట్ర కోణాన్ని బయట పెట్టకపోవడం విశేషం.
ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రం. ఇది ముమ్మాటికీ వాస్తవమైనా.. ప్రధాని మోదీ జాతీయ భావాలకు, విధానాలను అభిమానించే ప్రజలు ఉన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేశారన్న వారు బిజెపిని విభేదిస్తున్నారు. కానీ ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయాలను స్వాగతించేవారు అధికం. ఈ జాబితాలో యువత, విద్యా రంగ ప్రముఖులు ఉండడం విశేషం. అటువంటి వారికి జీ 20 వివరాలు, విశేషాలు అందకుండా పోయాయి. ఏ ఛానల్ చూసినా.. ఏ పత్రిక చూసినా.. చివరకు సోషల్ మీడియాలో సైతం చంద్రబాబు అరెస్ట్ వార్త ప్రాధాన్యంగా నిలిచింది. సరిగ్గా జి20 శిఖరాగ్ర సమావేశాల సమయంలోనే జగన్ లండన్ బాట పట్టారు. చంద్రబాబును అరెస్టు చేయించారు.
బండి సంజయ్ చెప్పే వరకు ఏపీ బీజేపీ నేతలు ఈ విషయమై నోరు మెదపకపోవడం విశేషం. చిన్న చిన్న విషయాలను, జాతీయ భావాలను వ్యక్తం చేసే ఏపీ బీజేపీ నేతలు.. జి ట్వంటీ సమావేశాల ఫలితాలను బిజెపికి దక్కకుండా జగన్ సర్కార్ కుట్ర చేసినా పట్టించుకోకపోవడం విశేషం. ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యలతోనైనా.. మేల్కొంటారో? లేదో? చూడాలి మరి.