Homeఆంధ్రప్రదేశ్‌Balineni Srinivas Shock To Janasena: టికెట్ ఇచ్చినా.. ఇవ్వకున్నా పోటీనే.. జనసేనకు బాలినేని ఝలక్

Balineni Srinivas Shock To Janasena: టికెట్ ఇచ్చినా.. ఇవ్వకున్నా పోటీనే.. జనసేనకు బాలినేని ఝలక్

Balineni Srinivas Shock To Janasena: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీని విభేదించి జనసేనలో చేరారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న బాలినేని వైయస్సార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బంధుత్వం కూడా ఉంది. రాజశేఖర్ రెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేను చేయడంతో పాటు మంత్రి పదవి ఇచ్చారు. బాలినేని సైతం రాజశేఖర్ రెడ్డి కుటుంబం పట్ల విధేయతతో కొనసాగారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. మంత్రి పదవిని సైతం వదులుకున్నారు. అయితే ఇప్పుడు అదే బాలినేని జనసేనలో చేరారు. భవిష్యత్ పై చాలా రకాల ఆశలు పెట్టుకున్నారు. కానీ పరిస్థితి అనుకూలించేలా లేదు. అందుకే ఇప్పుడు తీవ్ర అంతర్మధనంలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన చేసిన ఒక ప్రకటన సంచలనంగా మారింది.

Also Read: ప్లీజ్ పవన్ కళ్యాణ్.. అంబటి వింత కోరిక వైరల్!

 ఎన్నికల ఫలితాల తర్వాత..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు బాలినేని( balineni Srinivas Reddy ). అయితే పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని భావించి చాలా రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సైతం పట్టించుకోకపోవడంతో జనసేనలోకి వెళ్లిపోయారు. అయితే జనసేన టిడిపి కూటమిలో ఉంది. ఒంగోలులో బాలినేని పై టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్ధన గెలిచారు. ఇప్పుడు బాలినేని జనసేనలో చేరికను జనార్ధన వ్యతిరేకించారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బాలినేనిని జనసేనలో చేర్చుకున్నారు. బాలినేని సేవలను వినియోగించుకుంటామని కూడా పవన్ ప్రకటించారు. దీంతో గట్టి హామీ తోనే బాలినేని జనసేనలో చేరి ఉంటారని అంతా భావించారు. అయితే టిడిపి కూటమి నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పట్టించుకోవడం లేదు. సొంత పార్టీ జనసేన నేతలు సైతం పెద్దగా ఆహ్వానించడం లేదు. దీంతో డిఫెన్స్ లో పడిపోయారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆయనకు భవిష్యత్తు రాజకీయ బెంగ వెంటాడుతోంది. జనసేన నుంచి టికెట్ దక్కుతుందో? లేదో? అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి.

 సుదీర్ఘ నేపథ్యం..
బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. కాంగ్రెస్( Congress) పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2004లో తొలిసారిగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. దీంతో రాజశేఖర్ రెడ్డి బాలినేనిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2009లో సైతం బాలినేని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడు సైతం రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. అయితే రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు మంత్రి పదవిని వదులుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు బాలినేని. అయితే 2014లో బాలినేని ఓడిపోయారు. 2019లో ఆయన గెలవడంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే మంత్రివర్గ విస్తరణలో తప్పించడంతో తీవ్ర ఆవేదనకు గురైన బాలినేని అప్పటినుంచి పార్టీకి క్రమేపి దూరమవుతూ వచ్చారు.

Also Read:  ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన.. సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు

 మనస్థాపంతో పార్టీకి గుడ్ బై..
2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అయిష్టంగానే పోటీ చేశారు బాలినేని. ఎన్నికల్లో ఓడిపోవడంతో కొద్దిరోజులపాటు పార్టీలో కొనసాగారు. ప్రకాశం జిల్లా బాధ్యతలను అప్పగిస్తారని ఆశించారు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుపోవడంతో జనసేనలో చేరారు. వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి ఒంగోలు నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అయితే ఇక్కడ టిడిపికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా జనార్ధన ఉన్నారు. ఆయనను కాదని బాలినేనికి సీటు ఇచ్చే ఛాన్స్ లేదు. అందుకే బాలినేని అనవసరంగా జనసేనలో చేరానా? అన్న బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన టికెట్ రాకుంటే ఇండిపెండెంట్గా నైనా ఒంగోలు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు. దీంతో జనసేన టికెట్ ఇస్తే పార్టీలో కొనసాగుతారు. లేకుంటే బయటకు వెళ్తానన్న సంకేతం ఇచ్చినట్లు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి బాలినేని మనసులో ఏముందో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version