Balineni Srinivas: విసిగిపోయిన జగన్.. బాలినేనిని అంత మాట అనేశారా

జగన్ కు వీర విధేయత కలిగిన నేతల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒకరు. కానీ ఇటీవల ఆయన తీరు మారింది. మంత్రి పదవి పోయాక ఆయన ఒక అసమ్మతి నేతగా మారిపోయారు. ఆయన తీరుపై అధినేతతో పాటు పార్టీ శ్రేణులు సైతం విసుగు చెందుతున్నాయి.

Written By: Dharma, Updated On : September 16, 2024 10:14 am

Balineni Srinivasa Reddy

Follow us on

Balineni Srinivas: వైసీపీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తలనొప్పిగా తయారయ్యారు.ఆ పార్టీలో నిత్య అసమ్మతి వాదిగా ఆయన మారారు.తరచూ అసంతృప్తి వ్యక్తం చేయడం పరిపాటిగా మారింది. ప్రతి రెండు మూడు వారాలకు పార్టీ మారుతున్నట్లు లీకులు ఇవ్వడం… తరువాత పార్టీ మారకపోవడం పరిపాటిగా మారింది. ఏనాడైతే మంత్రివర్గ విస్తరణలో బాలినేని పదవిని జగన్ తొలగించారో.. నాటి నుంచి అసంతృప్తి మాట వినిపిస్తోంది. అప్పటినుంచి ఇప్పటివరకు బాలినేని పార్టీ మారుతారన్న ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగడం, వివాదాన్ని సర్దుబాటు చేయడం రివాజుగా మారింది.ఇప్పుడు కూడా పార్టీ మారుతానని బాలినేని మీడియాకు లీకులు ఇస్తున్నారు. దీంతో తాజాగా జగన్ నేరుగా రంగంలోకి దిగారు. బాలినేనితో సమావేశం అయ్యారు. అయితే బాలినేని తీరుతో విసుగు చెందిన జగన్.. పార్టీలో ఉంటే ఉండు.. లేకుంటే వెళ్ళిపో అని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

* సమీప బంధువు
ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ కు సమీప బంధువు. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి స్వయానా బావ. వైసిపి ఆవిర్భావ సమయంలో జగన్ వెంట నడిచారు బాలినేని. వై వి సుబ్బారెడ్డి తో కూడా మంచి సంబంధాలు కొనసాగించేవారు. ఆ ఇద్దరూ కలిసి పార్టీ కోసం కష్టపడ్డారు.ప్రకాశం జిల్లాలో వైసీపీ విజయానికి కృషి చేశారు. అయితే ఇప్పుడు వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న రీతిలో పరిస్థితి మారింది.కేవలం వైవి సుబ్బారెడ్డి పేరుతో తనకు రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందన్నది బాలినేని ఆవేదన.

* అలకల నేతగా గుర్తింపు
ఒక విధంగా చెప్పాలంటే వైసీపీలో బాలినేని అలకల నేతగా మారారు.వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాలినేనిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ప్రకాశం జిల్లాని శాసించారు బాలినేని. ఆ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డి తో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. జిల్లాపై ఆధిపత్యం కోసం ఇరువురు పోటీపడ్డారు. ఇంతలో మంత్రి వర్గాన్ని విస్తరించారు జగన్. బాలినేనిని మంత్రివర్గం నుంచి తొలగించారు. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలం సురేష్ ను మాత్రం కొనసాగించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు బాలినేని. దీని వెనుక వైవి సుబ్బారెడ్డి ఉన్నారన్నది ఆయన అనుమానం. అప్పటినుంచి విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో జగన్ వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా పంపించారు. అయినా సరే బాలినేనిలో అసంతృప్తి తగ్గలేదు.

* తరచూ పంచాయితీ
ఎన్నికల ముందు బాలినేని పంచాయితీ చాలా సందర్భాల్లో అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళింది. ముఖ్యంగా ఒంగోలులో ఇళ్ల పట్టాలు అందించాలని బాలినేని షరతులు పెట్టారు. దీంతో జగన్ స్వయంగా వెళ్లి ఇళ్ల పట్టాలను అందించారు. అదే సమయంలో ఒంగోలు ఎంపీ సీటును మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇవ్వాలని పట్టు పట్టారు. ఈ విషయంలో మాత్రం జగన్ వెనక్కి తగ్గలేదు. మా గుంటకు టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.మరోవైపుచిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో అయిష్టంగానే ఎన్నికలకు వెళ్లారు బాలినేని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లాలో పాతుకు పోతే తన పరిస్థితి ఏంటన్న ఆందోళనలో బాలినేని ఉన్నారు. అయితే తరచూ పార్టీ మారుతానని బాలినేని లీకులు ఇవ్వడం పై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.అయితే విసిగి వేశారి పోయిన జగన్ సైతం పార్టీలో ఉంటే ఉండు.. లేకుంటే బయటకు వెళ్ళిపో అని కరాకండిగా తేల్చి చెప్పినట్లు సమాచారం. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.