Balashowry Vallabbhaneni: ఉత్కంఠకు తెర పడింది. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి ఖరారయ్యారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ ప్రకటించారు. గత కొద్ది రోజులుగా నెలకొన్న సస్పెన్స్ కు తెర దించారు. పొత్తులో భాగంగా జనసేనకు రెండు పార్లమెంట్ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కాకినాడ పార్లమెంట్ స్థానానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించారు. ఇప్పుడు రెండో పేరును ప్రకటించారు. కొద్దిరోజుల కిందటే బాలశౌరి వైసీపీ నుంచి జనసేన లో చేరారు. ఇప్పుడు ఆయనకే టికెట్ ఖరారు అయింది. అయితే మచిలీపట్నం ఎంపీ స్థానానికి చాలా పేర్లు వినిపించాయి. కానీ పవన్ మాత్రం బాలశౌరికి అవకాశం కల్పించారు.
వల్లభనేని బాలశౌరి ది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన నేతగా పేరు పొందారు. 2004లో తొలిసారిగా తెనాలి ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జగన్ కు సైతం అత్యంత నమ్మకమైన నేతగా బాలశౌరి నడుచుకున్నారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలతో ఆయన వైసీపీకి దూరమయ్యారు. బాలశౌరి కంటే జగన్ పేర్ని నానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఇది మింగుడు పడని అంశంగా మారిపోయింది. పేరుకి ఎంపీ కానీ మచిలీపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించాలంటే ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.అప్పటివరకు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో లోక్సభలో సహచర ఎంపీలకు ఆయన ఢిల్లీలో విందు ఇచ్చారు. దీనికి రాష్ట్రం నుంచి అన్ని పార్టీల ఎంపీలు హాజరయ్యారు. అందులో భాగంగా వైసిపి ఎంపీలు సైతం పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ ఎంపీలను పిలిచి చీవాట్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వల్లభనేని బాలశౌరికి అవమానించినట్లు ప్రచారం జరిగింది. అప్పటినుంచి బాలశౌరిని జగన్ సైడ్ చేశారని తెలుస్తోంది.ఆ తరువాతనే మచిలీపట్నం ఎంపీ టికెట్ కోసం ఇతరులను పరిగణలోకి తీసుకోవడంతో బాలశౌరి మనసు మార్చుకున్నారు. పార్టీలో ఉండడం సేఫ్ కాదని భావించారు. అందుకే జనసేనలోకి చేరిపోయారు.
అయితే జనసేనలో ఎంపీ టికెట్ ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. బాలశౌరి స్థానంలో వేరొకరికి టికెట్ ఇస్తారని ప్రచారం ప్రారంభమైంది. ముఖ్యంగా నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు వంగవీటి రాధాకృష్ణ పేరు సైతం వినిపించింది. అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి బాలశౌరి ని పంపిస్తారని కూడా టాక్ నడిచింది. కానీ దీనిని బ్రేక్ చేస్తూ పవన్ కళ్యాణ్ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి పేరును ప్రకటించడం విశేషం.