Golla Baburao : వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులు జంప్ అవుతారా? ఇప్పటికే ఇద్దరు పార్టీని వీడారు? మరొకరు వీడుతారని ప్రచారం సాగుతోంది.ఇటీవల ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు పార్టీతో పాటు రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు.అయితే వైసీపీలో ఓ ఇద్దరు ఎంపీలు తప్ప మిగతా వారంతా పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని ప్రచారం సాగింది. క్రమేపి ఆ సంఖ్య తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఒక్కో ఎంపీ మీడియా ముందుకు వచ్చి ఖండించారు. తాము పార్టీలో కొనసాగుతామని స్పష్టం చేశారు.అయితే చివరకు ఒక ఎంపీ మాత్రంప్రచారాన్ని ఖండించలేదు.దీంతో ఆయన సైతం వెళ్ళిపోతారని అంతా భావించారు. కానీ సడన్ గా మీడియా ముందుకు వచ్చారు సదరు ఎంపీ.తాను దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డికి భక్తుడునని ప్రకటించారు. ఆయన కుమారుడు జగన్ ను విడిచిపెట్టే అవకాశం లేదని తేల్చేశారు. దీంతో వైసిపి హై కమాండ్ ఊపిరి పీల్చుకుంది. అయితే చివరిగా ప్రకటన చేసింది ఎవరో తెలుసా? ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన గొల్ల బాబూరావు. వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్న ఆయన.. సడన్ గా యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ నుంచి ఆశించిన స్థాయిలో భరోసా లభించడంతోనే ఆయన వైసీపీలో కొనసాగడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
* రాజశేఖర్ రెడ్డి పిలుపుతో
2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గొల్ల బాబురావు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న బాబురావు రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేశారు. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో.. జగన్ కు అండగా నిలిచారు. ఎమ్మెల్యే పదవి ఉండగానే వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లోను విజయం సాధించారు. 2014లో మాత్రం ఓడిపోయారు.
* మంత్రి పదవి ఆశించి
2019 ఎన్నికల్లో జగన్ పాయకరావుపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. జగన్ కష్ట కాలంలో ఉండగా అండగా నిలబడితే.. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పై అసంతృప్తి చెందారు. కనీసం విస్తరణలో అయినా తనకు ఛాన్స్ దక్కుతుందని భావించారు. దక్కకపోయేసరికి ఏకంగా అప్పటి సీఎంవో ఎదుటే నిరసన వ్యక్తం చేశారు. జగన్ తీరుపై బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ప్రచారం సాగింది. కానీ అనూహ్యంగా గొల్ల బాబురావును రాజ్యసభకు ఎంపిక చేశారు జగన్. పాయకరావుపేట అసెంబ్లీ స్థానం టికెట్ను విజయనగరం జిల్లా రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులకు ఇచ్చారు.
* అసంతృప్తికి అదే కారణం
ఎమ్మెల్యేగా ఉన్న బాబురావుకు రాజ్యసభకు పంపించడంతో ఆయన సంతృప్తికరంగా ఉంటారని అంతా భావించారు. అయితే జగన్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి వస్తే.. జగన్ మాత్రం తనకు సముచిత స్థానం ఇవ్వలేదన్నది బాబురావు లో ఉన్న బాధ. కనీసం పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదని.. అపాయింట్మెంట్ కూడా లభించలేదని చాలా రోజులుగా గొల్ల బాబురావు బాధపడుతూ వచ్చారు. అందుకే ఈ పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావించారు. అందుకే పార్టీ మారుతారు అన్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించలేదు. అయితే జగన్ రంగంలోకి దిగారు. బాబురావును బుజ్జగించారు. ఆయన కుమారుడి రాజకీయ జీవితంపై భరోసా ఇచ్చారు. అందుకే బాబురావు మీడియా ముందుకు వచ్చి తాను పార్టీ మారడం లేదని.. వైయస్సార్ కుటుంబానికి విధేయతగా ఉంటానని ప్రకటించినట్లు తెలుస్తోంది.