KTR Tweet :  సుభాన్ బుల్డోజర్ మ్యాన్.. క్యాప్ లు ధరించకుండానే కొంతమంది హీరోలవుతారు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

తెలంగాణలో హైడ్రా పేరుతో ఆక్రమణలపై, అక్రమ నిర్మాణాలపై రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగిస్తోంది. చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను పడగొడుతోంది. బఫర్ జోన్లలో కట్టిన కట్టడాలను నేలమట్టం చేస్తోంది. ఇది సహజంగానే ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి ఇబ్బందిగా మారింది. అందువల్లే వీలు చిక్కినప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 3, 2024 2:01 pm

Bulldozer man Subhan

Follow us on

KTR Tweet :   గత కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల చాలా ప్రాంతాలు నీటి ముంపుకు గురయ్యాయి.. అందులో ఖమ్మం జిల్లా ఒకటి. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు నీరు ముంచెత్తింది. దీనివల్ల ప్రకాష్ నగర్ వంతెన పై 9 మంది చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా కల్పించుకొని విజయవాడ నుంచి హెలికాప్టర్ రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ రావడం సాధ్యం కాలేదు. దీంతో ఆ వరద బాధితులు అక్కడే వంతెన పై ఉండాల్సి వచ్చింది. రాత్రి కావడంతో వారిని రక్షించేందుకు స్థానికంగా ఉన్న సుభాన్ ఖాన్ అనే వ్యక్తి తన ప్రాణాలకు తెగించి జెసిబి సహాయంతో వారిని రక్షించాడు. ఆ తర్వాత ఆ జెసిబి లో వారిని కూర్చోబెట్టి రోడ్డుకు చేర్చాడు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సుభాన్ ఖాన్ జెసిబి ని తోలుతుండగా కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాకా వెళ్ళింది. ఇంకేముంది ఆయన కూడా ఈ వీడియోను రీ ట్వీట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రభుత్వాన్ని విమర్శించకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

“తెలంగాణ బుల్డోజర్ మాన్ ముమ్మాటికి సుభాన్ ఖాన్. నెత్తికి క్యాప్ లు తొడిగిన వాళ్ళు మొత్తం హీరోలు కాలేరు. కొంతమంది తనకు క్యాప్ లు ధరించకపోయినప్పటికీ హీరోలుగా ఉద్భవిస్తుంటారు ” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో గత కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమాల వేదికగా కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. వరదల నివారణలో, బాధితులకు సకాలంలో సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడుతున్నారు.. అయితే ప్రస్తుతం కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. ఇటీవల కవిత జైలు నుంచి బెయిల్ మీద విడుదల కాగానే ఆయన మరుసటి రోజు అమెరికా వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. వరదల నేపథ్యంలో ఆయన వరుసగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ఖమ్మం – వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు కంటిజెన్సీ ఫండ్స్ కింద ఐదు కోట్లను విడుదల చేశారు. వరదల వల్ల నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.