Audimulapu Suresh: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఉంటూ టిడిపికి చాలామంది నేతలు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎర్రగొండపాలెం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. 2019 ఎన్నికల్లో అక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆదిమూలపు సురేష్. ఐదేళ్లపాటు పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కొనసాగిన నేతగా గుర్తింపు సాధించారు. కానీ ఆయనను 2024 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం బదులు వేరే నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. కానీ అక్కడ ఆయన ఓడిపోయారు. ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచారు. అయితే తనను షిఫ్ట్ చేసినందుకే ఓడిపోయాను అన్న బాధ ఆదిమూలపులో ఉంది. మరోవైపు తాటిపర్తి చంద్రశేఖర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు.
Also Read: విజయసాయిరెడ్డికి ఓకే.. చంద్రబాబుతో చర్చించనున్న బిజెపి పెద్దలు!
* అవిశ్వాసం వెనుక..
మొన్న ఆ మధ్యన ఎర్రగొండపాలెం( yarragonda Palam ) నియోజకవర్గంలోని త్రిపురాంతకం ఎంపీపీ పదవిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. అక్కడ ఎంపీపీ పై తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టింది. అయితే అక్కడ ఎక్కువ మంది ఎంపీటీసీలు వైసీపీ నుంచి టిడిపిలోకి ఫిరాయించారు. దాని వెనుక మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ హస్తం ఉందన్నది ప్రధాన ఆరోపణ. అయితే చివరి నిమిషం లో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఓ ఎంపీటీసీ సభ్యుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అవిశ్వాసం వీగింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఆదిమూలపు సురేష్ పాత్ర ఉందని హై కమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. హై కమాండ్ సైతం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
* అధినేతకు సన్నిహిత నేత..
ఆదిమూలపు సురేష్( Aadi moolappu Suresh ) అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన నేత. 2014లో అవకాశం ఇచ్చారు ఆయనకు జగన్మోహన్ రెడ్డి. 2019లో రెండోసారి గెలవడంతో ఆదిమూలపు సురేష్ జగన్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. కీలక విద్యాశాఖను కట్టబెట్టారు. అయితే మూడేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని విస్తరించారు. కానీ ఆదిమూలపు సురేష్ ని మాత్రం కొనసాగించారు. అయితే ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పక్కన పెట్టారు. అదే సమయంలో ఆదిమూలపు సురేష్ కు కొనసాగింపు లభించింది. వాస్తవానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమీప బంధువు. కానీ ఆయనను పక్కనపెట్టి ఆదిమూలపు సురేష్ ని కొనసాగించడం అప్పట్లో సంచలనం అయింది. తనను తొలగించి ఆదిమూలపు సురేష్ ని కొనసాగించడాన్ని బాలినేని జీర్ణించుకోలేకపోయారు. అప్పటినుంచి బాలినేని లో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది. అందుకు ముమ్మాటికి ఆదిమూలపు సురేష్ కారణమన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన అభిప్రాయం. అంతగా నమ్మిన జగన్మోహన్ రెడ్డిని ఆదిమూలపు సురేష్ ఎలా మోసం చేస్తారని ప్రశ్నించిన వారు ఉన్నారు.
* ఇద్దరు నేతల మధ్య ఆధిపత్యం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాన్ని ఇద్దరు నేతలు కోరుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్( Tathiparthi Chandrasekhar) వర్సెస్ ఆదిమూలపు సురేష్ అన్నట్టు అక్కడ పరిస్థితి మారిపోయింది. తాటిపర్తి చంద్రశేఖర్ ను మరింత పలుచన చేసేందుకు ఆదిమూలపు సురేష్ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ హై కమాండ్ దృష్టిలో ఉన్నాయని.. త్వరలో ఆదిమూలపు సురేష్ పై చర్యలు ఖాయమని ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.