Nara Lokesh: మంత్రి నారా లోకేష్ అనుకున్నది సాధించారు. వైసిపి హయాంలో టిడిపి నేతకు దక్కని పదవి ఇప్పుడు ఇప్పించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దుగ్గిరాల మండలం ఉంది. ఎంపీటీసీ ఎన్నికల సమయంలో టిడిపి బహిష్కరించింది. కానీ టిడిపి, జనసేన పొత్తుతో ముందుకు సాగి దుగ్గిరాల మండల పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. అయితే సాంకేతిక అంశాలను తెరపైకి తెచ్చి నాటి వైసిపి సర్కార్ అడ్డుకుంది. టిడిపి ఎంపీటీసీ సభ్యురాలికి ఎంపీపీ పదవి దక్కకుండా చేసింది. అయితే ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రావడం, ఈ విషయంలో సానుకూలంగా స్పందించడంతో టిడిపి ఎంపీటీసీ సభ్యురాలు జబీన్ ఎంపీపీ అయ్యారు. తాను అనుకున్నది సాధించగలిగారు.
* ధ్రువీకరణ పత్రం ఇవ్వక
వైసిపి హయాంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. దుగ్గిరాల మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టిడిపి తో పాటు జనసేన పది స్థానాల్లో విజయం సాధించాయి. రిజర్వేషన్లలో భాగంగా ఎంపీపీ పదవి బీసీ మహిళకు కేటాయించారు. టిడిపి, జనసేనలో బీసీ మహిళ జబీన్ ఒక్కరే ఉన్నారు. కానీ ఆమెకు బీసీ ధ్రువీకరణ పత్రం అందకుండా చేశారు. జబీన్ ఓసి కిందకు వస్తారు కాబట్టి సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చేశారు. మహమ్మద్ అనేది తన ఇంటి పేరు కాదని ఆమె చెప్పినా వినలేదు. అయితే ఆమెకు వరుసకు సోదరులైన వారికి మాత్రం అధికారులు బీసీ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అయితే అధికారులు నిరాకరించడంతో ఆమె పదవికి ఇబ్బంది ఎదురైంది. వెంటనే ఆమె కోర్టును ఆశ్రయించగా.. అప్పటి గుంటూరు కలెక్టర్ ఆమె బిసి కాదని గెజిట్ ఇస్తూ కోర్టుకు సమర్పించారు. దీంతో ఆమె వైస్ ఎంపీపీ గా కొనసాగుతూ వచ్చారు.
* పూర్తిస్థాయి ఎంపీపీగా
కూటమి అధికారంలోకి రావడంతో సీన్ మారింది. ఎంపీపీ గా ఉన్న దానబోయిన సంతోష రూపవాణి తన పదవికి రాజీనామా చేశారు. వైస్ ఎంపీపీ గా ఉన్న జబీన్ ఇంచార్జ్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా జిబీన్ కు అధికారులు బీసీ ధ్రువీకరణ పత్రం మంజూరు చేయడంతో.. ఆమె పూర్తిస్థాయిలో ఎంపీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. తద్వారా మంత్రి లోకేష్ అనుకున్నది సాధించగలిగారు.