Rayapati Sambasiva Rao: నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఝలక్ ఇచ్చింది. బ్యాంకు ను మోసం చేసిన కేసులో ఆయనకు చెందిన 48 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. రాయపాటికి చెందిన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. దీంతో ఈడి చర్యలకు దిగింది. ఈడి జప్తు చేసిన ఆస్తులలో వ్యవసాయ, నివాస స్థలాలు ఉన్నాయి. బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్న మొత్తంలో రూ.85.90 కోట్లను డైరెక్టర్లు, ప్రమోటర్లు తమ సొంత ఖాతాలకు మళ్లించినట్లు అభియోగాలు నమోదు అయ్యాయి. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో ఈడి ఎంట్రీ ఇచ్చింది. కఠిన చర్యలకు దిగింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
* పొలిటికల్ గా యాక్టివ్ లేదు
ప్రస్తుతం రాయపాటి కుటుంబం రాజకీయంగా యాక్టివ్ గా లేదు. ఎన్నికలకు ముందు టిడిపి సభ్యత్వంతో పాటు పార్టీకి రాజీనామా చేశారు రాయపాటి కుమారుడు రంగారావు. రాయపాటి సాంబశివరావుకు చిరకాల రాజకీయ ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలో చేరారు. ఆయనకు సత్తెనపల్లి సీటు కేటాయించారు చంద్రబాబు. అదే సమయంలో రాయపాటి కుటుంబానికి టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపారు. దీనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సాంబశివరావు 2014లో టిడిపిలో చేరారు. నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో తన కొడుక్కి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అందుకు చంద్రబాబు అంగీకరించలేదు. దీనికి తోడు తన చిరకాల ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పార్టీలోకి తెచ్చి టిక్కెట్ ఇచ్చారు. దీనిని జీర్ణించుకోలేకపోయారు రాయపాటి రంగారావు. కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫోటోలు సైతం ధ్వంసం చేశారు. అప్పట్లో ఆయన వైసీపీలో చేరుతారని ప్రచారం నడిచింది.
* సంచలన అంశమే
రాయపాటి సాంబశివరావు ప్రస్తుతం టిడిపిలోనే కొనసాగుతున్నారు. కానీ పార్టీలో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. తాజాగా ఈడి ఎంట్రీ కావడం, ఆస్తులను జప్తు చేయడం హాట్ టాపిక్ గా మారుతోంది. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే కమ్మ సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేత కావడంతో వీలైనంతవరకు ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.