Mohan Babu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. మరోసారి మోహన్ బాబు… అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మోహన్ బాబుకు హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోయింది. అయినా కానీ మోహన్ బాబు ఇంకా పోలీసుల విచారణకు అందుబాటులోకి రాలేదు. ఈ తరుణంలో మోహన్ బాబుకు మరోసారి నోటీసులు అందజేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవ పెద్ద హాట్ టాపిక్‌గా మారిందని చెప్పాలి. మంచు కుటుంబంలో గొడవ… మనోజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం… ఆ తర్వాత మోహన్ బాబు కేసు నమోదు చేయడం… ఆ తర్వాత మీడియా ప్రతినిధులపై దాడి చేయడం జరిగింది. దానితో మోహన్ బాబుపై కేసు నమోదైంది.
ఈ విషయంలో మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన కోర్టు ముందుకు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మరోసారి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ చెప్పారు. ప్రముఖ టీవీ ఛానల్ జర్నలిస్టు రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాను ప్రస్తుతం దేశంలోనే ఉన్నానని మోహన్ బాబు అఫిడవిట్ దాఖలు చేశారు. తన మనవరాలిని చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరిగొచ్చిన తాను ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నానని హైకోర్టుకు ఆయన స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం జల్‌పల్లిలోని తన ఫాం హౌస్‌లో న్యూస్ కవరేజీ కోసం వచ్చిన ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు మైకు తీసుకుని దాడి చేశారు. నమస్కారం అంటూ దగ్గరికి వచ్చిన మోహన్ బాబు ఊహించని విధంగా ఒక్కసారిగా జర్నలిస్టు చేతిలో మైకు లాక్కొని తలపై బలంగా కొట్టారు. ఈ ఘటనలో గాయపడిన జర్నలిస్టు రంజిత్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నాడు. తాను వయసులో పెద్దవాడినని.. తను ముందే కుటుంబ సమస్యలతో సతమతం అవుతుంటే న్యూస్ కవరేజీకి వచ్చి మైక్ ముందు పెట్టడంతో ఆవేశానికి లోనై దాడి చేసినట్లు మోహన్ బాబు అంగీకరించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి జర్నలిస్టు రంజిత్‌ను, ఆయన కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. తాను చేసిన పనికి క్షమాపణ చెప్పారు. ఎవరిపైనా తనకు వ్యక్తిగతంగా కోపం లేదని, కానీ కొన్ని కారణాలతో ఆ సమయంలో అలా జరిగిపోయిందన్నారు.
జర్నలిస్టుపై దాడి ఘటనతో అప్రమత్తమైన రాచకొండ పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశారు. ఆయన వద్ద ఉన్న రెండు లైసెన్సుడ్ గన్స్ సరెండర్ చేయకపోతే వారంట్ జారీ చేసి అరెస్టు చేస్తామని కూడా హెచ్చరించారు. దీంతో మోహన్ బాబు హైదరాబాద్ లో ఓ తుపాకీ సరెండర్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గన్ సరెండర్ చేసినట్లు స్వయంగా వెల్లడించారు. ఒక లైసెన్స్ గన్‌ను చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేశారు. మరో గన్ ను ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరెండర్ చేశారు.మోహన్ బాబు ఇంట్లో కుటుంబ సమస్యసల కారణంగా ఇరువులు కుమారులు గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు కూడా ఆవేశంగా మీడియా ప్రతినిధిపై దాడి చేశారు.
రాచకొండ పోలీసులు జర్నలిస్ట్ పై దాడి కేసులో తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించినప్పటికీ డిసెంబర్ 24 తేదీ వరకూ విచారణకు హాజరు కాకుండా మోహన్ బాబు స్టే తెచ్చుకున్నారు. ఈ క్రమంలో తనను అరెస్ట్ చేయకుండా చూడాలని మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు మోహన్ బాబు పిటిషన్‌ను కొట్టివేస్తూ షాకిచ్చింది. కోర్టు ఇటీవల ఇచ్చిన గడువు సైతం మంగళవారం పూర్తి అయింది. కోర్టు గడవు పూర్తి కావడంతో మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని చెబుతామని రాచకొండ సీపీ పేర్కొన్నారు. మోహన్ బాబు చర్యల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.