AP Social Media: ఏపీలో ఏకపక్షంగా సోషల్ మీడియాపై కేసులు నమోదవుతున్నాయా? కేవలం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను మాత్రమే వెంటాడుతున్నారా? వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల పాటు ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలు జరగలేదు. వైసిపి మాదిరిగా వ్యవహరించకూడదని టిడిపి కూటమి నేతలు భావించారు. అయితే దానిని చేతకానితనంగా కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు భావించారు. ఓటమియాతలతో పాటు వారి కుటుంబాల్లోని మహిళలపై అత్యంత దారుణంగా పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ప్రశ్నించడం అంటే ఇంట్లో ఆడవాళ్లను బూతులు తిట్టడమే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏకంగా హోం మంత్రిత్వ శాఖ పై ఫైర్ అయ్యారు. అటు తరువాతనే సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు ప్రారంభమయ్యాయి. అరెస్టులు మొదలయ్యాయి.
* ఫేక్ న్యూస్ ప్రచారం
భావ స్వేచ్ఛ పేరిట సోషల్ మీడియాలో అభిప్రాయాలు పెడితే పర్వాలేదు. కానీ అభిప్రాయం పేరుతో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం.. ప్రభుత్వ పెద్దల కుటుంబాలను లాగి తీవ్ర పదజాలంతో దూషించడం వంటివి చేస్తున్నారు. ఇప్పటికే మూడు నాలుగు సార్లు నోటీసులు అందించినా.. చాలామంది వెనక్కి తగ్గడం లేదు. పవన్ ఆవేశంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సీరియస్ యాక్షన్ లోకి దిగారు. వీరిలో ఓ నిందితుడిని ఎంపీ అవినాష్ రెడ్డి చొరవతో వదిలేసినట్లు ఆరోపణలు రావడంతో ఎస్పీపై బదిలీ వేటు వేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండడం.. అరెస్టులు జరుగుతుండంతో వైసిపి కొత్త వాదన మొదలుపెట్టింది. ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తున్నారన్నది వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణ.
* కేవలం అటువంటి వారిపైనే
అయితే ఇంతవరకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై మాత్రమే కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి, రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి వంటి వారి పై విషయంలో మాత్రమే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నాయకుల జోలికి ఇంతవరకు వెళ్ళని విషయాన్ని గ్రహించుకోవాలి. అదే సమయంలో టిడిపి నేతలు నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నారు. వైసిపి హయాంలో టిడిపి సోషల్ మీడియా కార్యకర్తల సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల కేసులు అప్పట్లో నమోదు చేసినట్లు తెలుస్తోంది. చివరకు సామాజిక సేవా కార్యకర్తగా గుర్తింపు పొందిన రంగనాయకమ్మ అనే మహిళ.. ప్రభుత్వ వ్యతిరేక పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశారని కేసు నమోదు చేశారు. కేవలం విధానపరంగా మాత్రమే విమర్శ ఉంది. వ్యక్తిగతంగా ఎక్కడా టార్గెట్ చేయలేదు. విధానపరమైన అంశాల్లో ప్రభుత్వ చర్యలను విభేదించిన వారిపై సైతం అప్పట్లో ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు మాత్రం కేవలం వ్యక్తిగత కామెంట్స్ చేస్తున్న వారిపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అందుకే వైసిపి నేతల ఆరోపణలను తిప్పి కొడుతున్నారు టిడిపి శ్రేణులు.