Nellore politics : నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి కుటుంబం ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగింది మేకపాటి కుటుంబం. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా, ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా జిల్లాలో చక్రం తిప్పారు. అటువంటి కుటుంబంలో చీలికలు రావడం, రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి మరణించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రాజమోహన్ రెడ్డి, ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డి ఇద్దరు ఓడిపోయారు. అప్పటినుంచి పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. ఇంకోవైపు నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి వస్తుండడంతో ఆత్మరక్షణలో పడింది ఆ కుటుంబం. దీనికి తోడు కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. అదే సమయంలో వైసీపీ క్లిష్ట పరిస్థితుల్లో కొనసాగుతోంది. ఈ సమయంలో రాజకీయం చేయడం అంత శ్రేయస్కరం కాదని మేకపాటి కుటుంబం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో
రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లో తిరుగులేని నేతగా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు. ఓవైపు నెల్లూరు ఎంపీగా రాజమోహన్ రెడ్డి కొనసాగితే.. ఆయన తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే గా ఉండేవారు. కానీ వైయస్ మరణంతో ఈ కుటుంబం ఒక్కసారిగా డీలా పడింది. వైసిపి ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేసింది. కానీ 2019 ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డికి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ దక్కలేదు
దీంతో వారసుడు గౌతమ్ రెడ్డిని బరిలో దించారు. ఆత్మకూరు నుంచి గౌతమ్ రెడ్డి భారీ విజయం సాధించడంతో జగన్ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. అయితే అప్పటివరకు సోదరుడు రాజమోహన్ రెడ్డితో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి విభేదించడం ప్రారంభించారు. అయితేగౌతంరెడ్డి అకాల మరణంతో మరో కుమారుడు విక్రమ్ రెడ్డిని బరిలో దించారు. ఉప ఎన్నికల్లో విక్రం రెడ్డి భారీ విజయం సాధించారు. అయితే అప్పటినుంచి మేకపాటి కుటుంబంలో ఒక రకమైన చీలిక వచ్చింది. ఈ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి బయటకు వెళ్లి పోవాల్సి వచ్చింది.
* తెరపైకి పునర్విభజన
ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఆత్మకూరు నుంచి మరోసారి విక్రమ్ రెడ్డి బరిలో దిగారు. తండ్రి కొడుకులు ఇద్దరూ ఓటమి చవిచూశారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో వీరికి పట్టున్న మండలాలు చేజారిపోయే అవకాశం ఉంది. ఇంకోవైపు నెల్లూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తుందా రాదా అన్నది కూడా తెలియడం లేదు. అందుకే ఆ కుటుంబం పొలిటికల్ డిఫెన్స్ లో పడినట్లు తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి ఆ కుటుంబ అడుగులు ఎటు పడతాయో చూడాలి.