APSRTC in Amaravati : అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం పై ఫుల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఒకవైపు నిర్మాణాలు ప్రారంభిస్తూనే మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలు, టెర్మినల్స్ నిర్మాణానికి 165 ఎకరాల భూమిని కేటాయించాలని కోరింది. అమరావతి రాజధాని నిర్మాణాన్ని నవ నగరాల్లో చేపట్టాలన్నది ఒక ప్లాన్. అందుకే భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 9 నగరాల్లో బస్టాండ్లు, డిపోలు నిర్మించాలని ఆలోచన చేస్తోంది. విజయవాడ, గుంటూరు వంటి నగరాలకు రాకపోకలతో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం మూడు ఇంటర్ చేంజ్ టెర్మినల్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. గత నెల నాలుగున ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ నిర్మాణాలకు సంబంధించి పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ఆర్టీసీ ప్రతిపాదనలు సిఆర్డిఏ కి వచ్చాయి.
Also Read : ఉత్తరాంధ్ర మంత్రుల్లో ఆ ఒక్కరు ఎవరు?
* రాజధానికి వచ్చే ప్రజల కోసం..
రాజధానిలో సచివాలయం తో పాటుగా హైకోర్టు( High Court) కూడా ఉంటుంది. నిత్యం ప్రజలు సొంత పనులపై రాజధానికి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రద్దీకి తగిన విధంగా రవాణా సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వంతో పాటుగా ఏపీఎస్ఆర్టీసీ భావిస్తోంది. అందుకే అమరావతిలో బస్టాండ్లు, డిపోలు, టెర్మినల్స్ నిర్మాణానికి భూములు కేటాయించాలని కోరుతోంది. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సిఆర్డిఏకు ప్రతిపాదనలు కూడా పంపింది. మొత్తం 165 ఎకరాల భూమిని కేటాయించాలని ఆర్టీసీ సిఆర్డిఏ ని కోరింది.
* నవ నగరాల్లో నిర్మాణాలు..
అమరావతిలో నవ నగరాలు( nine cities ) నిర్మించాలన్నది ప్లాన్. వీటిలో పరిపాలన, ఆర్థిక, న్యాయ, విజ్ఞాన నగరాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, పర్యాటక, ఆరోగ్య, క్రీడా, మీడియా నగరాలు కూడా ఉన్నాయి. ఈ నగరాల్లో బస్టాండ్లు, డిపోలు నిర్మించాలని ఆర్టీసీ ఆలోచన చేస్తోంది. ఒక్కో బస్టాండ్ కు 5 ఎకరాలు, డిపోకు ఐదు ఎకరాలు అవసరం అవుతాయని అంచినా వేస్తున్నారు. మొత్తం తొమ్మిది బస్టాండ్లు, డిపోలకు కలిపి 90 ఎకరాలు కావాలని నిర్ధారించారు. ఈ డిపోల నుంచి బస్సులు నగరాల మధ్య రాకపోకలు సాగిస్తాయి. ముఖ్యంగా అమరావతికి అతి చెరువులో ఉండే విజయవాడ, గుంటూరుకు కూడా ఎక్కువగా రాకపోకలు ఉండరున్నాయి. మరోవైపు దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం మూడు ఇంటర్ చేంజ్ టెర్మినల్స్ ను ఏర్పాటు చేయనున్నారు.
* మూడు టెర్మినల్స్ ఏర్పాటు..
అందరి ఆమోదయోగ్యంతోనే అమరావతిని ( Amaravathi )రాష్ట్రం నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్నారు. అందుకే ఇటు ఉత్తరాంధ్ర నుంచి వెళ్లే వారి కోసం ఒక టెర్మినల్.. అటు హైదరాబాదు నుంచి వచ్చే బస్సుల కోసం మరో టెర్మినల్.. రాయలసీమ జిల్లాలనుంచి వచ్చే బస్సుల కోసం ఇంకో టెర్మినల్ ఉంచేలా ఆలోచన చేస్తున్నారు. రాష్ట్రంలోని మూడు వైపుల దూరప్రాంతాల నుంచి అమరావతికి వచ్చే బస్సులు.. అమరావతి లోపల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ టెర్మినల్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి సిటీ బస్సుల్లో అమరావతికి రాకపోకలు సాగించాలన్నది ప్రణాళిక. అయితే ఒక్కో టెర్మినల్ ఏర్పాటుకు 25 ఎకరాల చొప్పున భూమి అవసరమని ఆర్టీసీ సిఆర్డిఏ కు ప్రతిపాదన ఇచ్చింది. ఇలా మొత్తం అమరావతిలో తమకు 165 ఎకరాల భూమి అవసరమని ఆర్టీసీ భావిస్తోంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. సిఆర్డిఏ ఒక నిర్ణయానికి రానుంది. మరి ఆర్టీసీ ప్రతిపాదనలపై సీఆర్డీఏ, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.