AP vs Karnataka: ఏపీకి( Andhra Pradesh) పెట్టుబడులు తెచ్చే పనిలో ఉన్నారు మంత్రి నారా లోకేష్. రెండు రోజుల కిందట ఆయన లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఓ కంపెనీ సీఈఓ రోడ్ల సమస్యపై చేసిన ట్వీట్ పెద్ద చర్చకు దారితీసింది. ఆ సీఈవో ట్వీట్ పై స్పందించారు మంత్రి నారా లోకేష్. విశాఖకు రమ్మని ఆహ్వానించారు. అయితే దీనిపై తాజాగా స్పందించారు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్. బ్లాక్మెయిల్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు లోకేష్ సైతం కౌంటర్ ఇచ్చారు. తాము ప్రజల సమస్యలను పట్టించుకుంటామంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు నారా లోకేష్. ప్రస్తుతం ఇదో వైరల్ అంశంగా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా.. ఏపీలో కూటమి అధికారంలో ఉంది. పరస్పర రాజకీయ విరుద్ధ ప్రభుత్వాలు అయినా మంచి వాతావరణం నడుస్తూ వచ్చింది. అటువంటిది కర్ణాటక డిప్యూటీ సీఎం వర్సెస్ ఏపీ మంత్రి అన్నట్టు వ్యవహారం మారింది.
రోడ్ల దుస్థితి పై ట్వీట్..
బెంగళూరులోని( Bangalore) బ్లాక్ బక్ అనే కంపెనీ సీఈవోగా రాజేష్ యా బాజీ ఉన్నారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు దొమ్మారం రేపుతోంది. ఆయన ఇచ్చిన ట్వీట్ పై స్పందించారు మంత్రి నారా లోకేష్. సదరు కంపెనీని విశాఖకు ఆహ్వానించారు. బెంగళూరులో వర్షాలు, రోడ్ల వ్యవహారంపై జాతీయస్థాయిలో చర్చ సాగుతోంది. రాజేష్ యాబాజీ తన ట్వీట్లో ‘ గతంలో ఇంటి నుంచి ఆఫీస్కు వెళ్లి రావడం సులభంగా ఉండేది. ఇప్పుడు కఠినంగా ఉంది. మా కంపెనీ ఉద్యోగులు ఆఫీస్కు రావాలంటే గంటన్నర సమయం పడుతోంది. రోడ్లన్నీ గుంతలు, దుమ్ముతో నిండి ఉన్నాయి. గత ఐదేళ్లుగా ఎలాంటి మార్పు లేదు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం’ అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు.’ హాయ్ రాజేష్.. నేను మీ కంపెనీని విశాఖకు మార్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాను. దేశంలోనే విశాఖ పరిశుభ్రమైన నగరాల్లో ఒకటి. అక్కడ మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. మహిళలకు సైతం సురక్షిత నగరంగా గుర్తింపు ఉంది. నాకు డిఎం పంపండి’ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు అదే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది.
శివకుమార్కు లోకేష్ కౌంటర్
అయితే తాజాగా దీనిపై స్పందించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఇటువంటి బెదిరింపులకు, బ్లాక్ మెయిల్లకు పట్టించుకోదంటూ కామెంట్ చేశారు. బెంగళూరులో ప్రపంచ స్థాయి సంస్థలు ఉన్నాయని.. ఇప్పటికే తమ ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలతో రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. బెంగళూరులో గుంతలు పూడ్చడానికి, రోడ్ల మరమ్మత్తులు పూర్తిచేసేందుకు నవంబర్ వరకు డెడ్ లైన్ విధించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే డీకే శివకుమార్ కామెంట్స్ చేసిన తర్వాత మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు.’ మిగిలిన రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్కు ఉన్న తేడా అదే.. మా ప్రజల నిజమైన సమస్యలను బ్లాక్ మెయిల్ గా కొట్టిపారేయలేం.. వాటిని మర్యాదపూర్వకంగా శ్రద్ధ చూపించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం’ అన్నారు నారా లోకేష్. బ్లాక్ మెయిల్ అనే పదాన్ని హైలెట్ చేశారు. దీంతో ఇది డీకే శివకుమార్కు కౌంటర్ అని ఎక్కువమంది భావిస్తున్నారు. మొత్తానికైతే రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు ఈ సరికొత్త వార్ నడుస్తోంది.
Here’s what sets AP apart from others – we don’t dismiss our people’s genuine grievances as ‘Blackmail’. We treat them with the dignity and seriousness they deserve. https://t.co/ZszTXYEeqG
— Lokesh Nara (@naralokesh) September 18, 2025