AP Temperature : ఏపీలో ( Andhra Pradesh) ఎండలు మండిపోతున్నాయి. సెగలు పుట్టిస్తున్నాయి. ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నం కి ఎండ తీవ్రతరం అవుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వడగాలు కూడా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం అయ్యింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నారు.
Also Read : ఏపీలో మండిపోనున్న ఆ జిల్లాలు.. బిగ్ అలెర్ట్!
* అంతటా అదే స్థాయిలో
శ్రీకాకుళం ( Srikakulam )జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు నమోదు కానంతగా మంగళవారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఏడు మండలాల్లో, విజయనగరం జిల్లాలో 17 మండలాల్లో, పార్వతీపురం మన్యం జిల్లాలో 13 మండలాల్లో, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రెండు మండలాల్లో తీవ్రవడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. మంగళవారం నంద్యాల జిల్లా డోర్నిపాడు లో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇప్పటివరకు ఇదే రికార్డు ఉష్ణోగ్రత.
* ఉడికిపోయిన రాష్ట్రం..
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉడికి పోయింది. ఉష్ణోగ్రత ఒకవైపు, ఉక్కపోత మరోవైపు ఉక్కిరి బిక్కిరి చేసింది. కడప జిల్లా సిద్ధవటం లో 43.8°, కర్నూలులో 43.5 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా వత్తలూరులో 42.9, ప్రకాశం జిల్లా పెద్దదొర్నాలలో 42.8, పలనాడు జిల్లా నర్మాలపాడు లో 42.4 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 195 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం.
* హోంమంత్రి సమీక్ష..
మరోవైపు పెరుగుతున్న ఎండల దృష్ట్యా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత( home minister vangalapudi Anita ) అధికారులతో సమీక్షించారు. తాడేపల్లి లోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వేసవి ముందస్తు సంసిద్ధతపై సమీక్ష జరిపారు. రాబోయే రోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్న నేపథ్యంలో.. వడగాల్పుల పట్ల అవగాహన, అప్రమత్తతకు సంబంధించి అన్ని శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్ళవద్దని ప్రచారం చేస్తున్నారు.
Also Read : అగ్గి మంటలో ఏపీ.. ఆ జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు!