AP Roads: రాష్ట్రంలో రహదారులు బాగుపడుతున్నాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. అయితే అందమైన రోడ్లతో పాటు.. అదే రహదారులపై పన్నులు వసూలు చేసే టోల్ ప్లాజాలు రానున్నాయి. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులపై టోల్ బాదుడు తప్పనిసరి కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్రంలో ఎంపిక చేసిన రహదారులను అభివృద్ధి చేసి.. వాటిపై టోల్ పన్ను వసూలు చేయనున్నారు. ఇందులో భాగంగా అధికారులు ముందుగా 16 నగరాల్లో రోడ్లను ఎంపిక చేశారు. వాటిని అభివృద్ధి చేసేందుకు అధికారులు రెడీ చేసిన ప్లాన్ కు త్వరలో ప్రభుత్వం ఆమోదముద్ర వేయబోతోంది.అనంతరం టెండర్లకు పిలుస్తారు.గత ఐదేళ్ల వైసిపి పాలనలో రహదారుల నిర్వహణను గాలికి వదిలేసారు.వాటిని అభివృద్ధి చేయాలంటే నిధుల కొరత అధికంగా ఉంది. దీంతో దానిని అధిగమించేందుకు పీపీపీ విధానంలో రోడ్లు బాగు చేయనున్నారు అన్నమాట. కాంట్రాక్టర్ రోడ్డు వేసి టోల్ టాక్స్ వసూలు చేసుకోవడం అన్నమాట. ఇప్పటికే అంతర్ రాష్ట్ర రహదారులను గుర్తించి అభివృద్ధి చేయడానికి నిర్ణయించారు. ఇప్పుడు పట్టణాలతో పాటు నగరాల్లో కూడా రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించారు.
* 643 కిలోమీటర్ల మేర
రాష్ట్రవ్యాప్తంగా 16 నగరాల్లో ఉన్న 643 కిలోమీటర్ల మేర రోడ్లను ఎంపిక చేశారు. వీటి అభివృద్ధి, నిర్వహణకు త్వరలో టెండర్లు పిలుస్తారు. అనంతరం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు పని ప్రారంభిస్తారు.అయితే విశాఖ నగరంలోనే 253 కిలోమీటర్ల రహదారిని బాగు చేయనున్నారు. నెల్లూరులో 83 కిలోమీటర్లు, గుంటూరులో 60 కిలోమీటర్లు, కాకినాడలో 39 కిలోమీటర్లు, విజయనగరంలో 33 కిలోమీటర్లు, చిత్తూరులో 29 కిలోమీటర్లు, కడపలో 28 కిలోమీటర్లు, అనంతపురంలో 21 కిలోమీటర్లు, తిరుపతిలో 19 కిలోమీటర్లు, విజయవాడలో 17 కిలోమీటర్లు, శ్రీకాకుళంలో 12 కిలోమీటర్లు, మచిలీపట్నంలో 11 కిలోమీటర్లు, కర్నూలు, రాజమండ్రిలో ఏడు కిలోమీటర్లు, ఏలూరులో ఐదు కిలోమీటర్ల మేరా రహదారులను అభివృద్ధి చేయనున్నారు.
* అన్ని బాధ్యతలు వారికే
అయితే ఈ నిర్మాణాలకు సంబంధించి టెండర్లు పిలవనున్నారు. టెండర్లు ఖరారు అయిన వెంటనే పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. నిర్దేశించిన సమయంలో పూర్తి చేయవలసి ఉంటుంది. పదేళ్లపాటు నిర్వహణ బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్ దే. మధ్యలో రిపేర్లు వచ్చినా వారిదే బాధ్యత. వీటిపై టోల్ ప్లాజా లు కూడా ఆ కాంట్రాక్టర్లు ఏర్పాటు చేయనున్నారు. వాహనదారుల నుంచి టోల్ వసూలు చేయనున్నారు. వీటిపై ప్రకటనల బాధ్యత, ఆదాయం సైతం సంబంధిత కాంట్రాక్టర్ దే.