Rajya Sabha: రాజ్యసభ సభ్యుల నామినేషన్ గడువు సమీపిస్తోంది.రేపటితో ముగియనుంది. కానీ కూటమి నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇంతవరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. 164 అసెంబ్లీ సీట్లలో గెలుపొందింది. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది.దీంతో రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ పాత్ర ముగిసింది.ఏపీ నుంచి ఎన్నికలు జరిగే మూడు రాజ్యసభ సీట్లు కూటమికేనని తేలిపోయింది.అయితే ఆ మూడు పదవుల పంపకం విషయంలో ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. టిడిపికి రెండు, బిజెపికి ఒకటి అని మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు టిడిపికి రెండు, జనసేనకు ఒకటి అని ప్రచారం నడిచింది. అయితే అనూహ్యంగా బిజెపి తెరపైకి వచ్చింది. ఆ పార్టీకి ఒకటి ఖాయమని తెలుస్తోంది. అయితే రేపటితో నామినేషన్ల గడువు పూర్తి కానుంది. ఇంతవరకు కూటమి నుంచి ఎటువంటి పేర్లు బయటకు రాకపోవడం విశేషం.
* ఆ ఇద్దరికీ ఓకే
వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజ్యసభ పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశారు. అందులో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు టిడిపిలో చేరారు. మోపిదేవి వెంకటరమణకు రాజ్యసభ పై ఆసక్తి లేదు. కానీ బీదా మస్తాన్ రావు మాత్రం మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు ఒప్పందం చేసుకునే టిడిపిలో చేరినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పేరు సైతం ఖరారు అయినట్లు సమాచారం. ఇంకోవైపు ఆర్ కృష్ణయ్యసొంత పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన బిజెపిలో చేరతారని తెలుస్తోంది. ఆయన కోసమే రాజ్యసభ పదవిని బిజెపి హై కమాండ్ పట్టుబడుతున్నట్లు సమాచారం. అంటే ఒకటి టిడిపికి, మరొకటి బిజెపికి తేలిపోయిందన్నమాట. అయితే మిగిలి ఉన్న ఆ ఒక్క పదవి టిడిపి ఉంచుకుంటుందా? లేకుంటే జనసేన పోటీ చేస్తుందా? అన్నది తెలియాలి.
* నాగబాబుకు నో ఛాన్స్
కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాగబాబు పేరు ప్రధానంగా వినిపించింది. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఆయనను ఎంపిక చేస్తే సుముఖత వ్యక్తం చేయలేనట్టు ప్రచారం జరిగింది. ఆయన మనసంతా రాజ్యసభ పై ఉందని టాక్ నడిచింది. దీంతో రాజ్యసభ ఎన్నికలు వస్తే నాగబాబుకు తప్పకుండా పదవి ఖాయమనితెగ ప్రచారం నడిచింది. ముగ్గురు వైసీపీ సభ్యులు రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే రెండు పదవుల్లో నాగబాబు పేరు ప్రకటించడమే తరువాయి అన్నట్టుగా పరిస్థితి ఉండేది. అయితే అనూహ్యంగా జనసేనకు ఈసారి అవకాశం లేనట్టు తెలుస్తోంది. టిడిపి నుంచి సానా సతీష్, గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్, యనమల రామకృష్ణుడు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే మరో 36 గంటల్లో నామినేషన్ల గడువు ముగియనుంది. కానీ ఇంతవరకు రాజ్యసభ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు కూటమి. ఈ సాయంత్రానికి దీనిపై ఫుల్ క్లారిటీ రానున్నట్లు సమాచారం.