AP RajyaSabha Election: ఏపీలో ( Andhra Pradesh) రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభమైంది. జూన్లో ఓ నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఆ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లలో ఉంది ఎన్నికల కమిషన్. ఏప్రిల్ లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ నాలుగు సీట్లు టిడిపి కూటమికి దక్కనున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ పార్టీకి రాజ్యసభ సీటు దక్కే పరిస్థితి లేదు. అయితే ఈ నాలుగు పదవులను కూటమిలోని మూడు పార్టీలు పంచుకుంటాయా? ఈసారి టిడిపికి మూడు.. జనసేనకు ఒకటి దక్కనుందా? లేకుంటే బిజెపి సైతం పదవిని ఆశిస్తోందా? అన్నది చూడాలి. రాజ్యసభ పదవులపై మూడు పార్టీల్లోనూ ఆశావహులు ఉన్నారు. నేతల మధ్య గట్టి పోటీ ఉండనుంది.
* టిడిపి బిజెపి చెరి సగం..
ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి రెండుసార్లు రాజ్యసభ పదవులను భర్తీ చేశారు. అందులో రెండు పదవులను టిడిపి దక్కించుకుంది. మరో రెండు పదవులను బిజెపి సొంతం చేసుకుంది. అయితే కేంద్రంలో బిజెపి అవసరం దృష్ట్యా ఆ పార్టీకి ఎక్కువగా రాజ్యసభ పదవులు ఇవ్వాల్సి వస్తోంది. మూడు పార్టీల కూటమి కావడంతో పదవులు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. అయితే గత రెండుసార్లు జనసేనకు ఇవ్వలేదు కనుక.. ఆ పార్టీకి ఒక రాజ్యసభ పదవి ఇస్తారని తెలుస్తోంది. మిగతా మూడు పదవులను టిడిపి తీసుకుంటుందా? లేకుంటే రెండింటికి మాత్రమే పరిమితం అవుతుందా? అన్నది చూడాలి. చంద్రబాబుతో పాటు పవన్ కేంద్ర పెద్దలతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు.
* ఆశావహులు అధికం..
తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో చాలామంది ఆశావహులు ఉన్నారు. ఇందులో పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు. సీనియర్ నేతలు ఉన్నారు. ప్రధానంగా పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఆయన సైతం రాజ్యసభ పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు దేవినేని ఉమా, మహాసేన రాజేష్, గల్లా జయదేవ్, చింతకాయల విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టిడిపికి మూడు పదవులు వస్తే సానా సతీష్ కు మరోసారి కొనసాగింపు ఉంటుంది. మరో రెండు పదవులకు సామాజిక సమతూకం పాటించాల్సి ఉంటుంది. అయితే తనకు ఇదే చివరి అవకాశం అని.. రాజ్యసభ పదవి ఇవ్వాలని యనమల రామకృష్ణుడు కోరుతున్నారు. ఆయనకు ఛాన్స్ ఇస్తే మిగిలేది ఒకే పదవి. యనమల రామకృష్ణుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో.. మిగిలిన పదవి ఎస్సీలకు కానీ.. ఓసీలకు కానీ కేటాయిస్తారని తెలుస్తోంది. అయితే దేవినేని ఉమాకు చాన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. మరోవైపు మహాసేన రాజేష్ కు గత ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. కానీ అభ్యంతరాలతో వెనక్కి తగ్గారు. గల్లా జయదేవ్ సైతం ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన సైతం రాజ్యసభ పదవిని ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?