AP Rains: ఏపీలో( Andhra Pradesh) భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. గత నాలుగు రోజులుగా అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం వరకు ఉక్కపోత, సాయంత్రానికి చిరుజల్లులు పడడం ఆనవాయితీగా మారింది. రానున్న ఐదు రోజులపాటు ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వడగాలుల తీవ్రత కూడా ఉంటుందని చెబుతున్నారు. ప్రజలను ముందస్తుగానే అప్రమత్తం చేస్తున్నారు. పని ఉంటే కానీ ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు.
Also Read: జగన్ ని వ్యతిరేకిస్తావా? పోలీస్ అధికారికి బెదిరింపులు!
* ఉదయం ఎండ.. మధ్యాహ్నానికి వర్షం
చాలా జిల్లాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం వేళ ఎండ తీవ్రత ఉంటోంది. మధ్యాహ్నం కి మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభం అవుతోంది. సాయంత్రానికి చల్లటి వాతావరణం ప్రారంభమవుతోంది. ఉత్తర కోస్తా( North coastal ), రాయలసీమలో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. అయితే చిరుజల్లులతో మాత్రం సాయంత్రానికి వాతావరణం చల్లబడుతోంది. ఇది కొంత ఉపశమనం కలిగించే విషయం. మళ్లీ ఉదయం 7 గంటల వరకు చల్లటి వాతావరణం కొనసాగుతూ వస్తోంది. 8 గంటల నుంచి ఎండలు విశ్వరూపం చూపిస్తున్నాయి.
* నగరాల్లో ఉష్ణోగ్రత.. విజయవాడ( Vijayawada), గుంటూరు, కర్నూలు వంటి నగరాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. సాయంత్రానికి వర్షం పడుతుండడంతో రహదారులు జలమయం అవుతున్నాయి. ఒంగోలు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షం నమోదయింది. నగరమంతా జలమయంగా మారింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో బుధవారం వర్షం కొనసాగింది.
* గాలివాన బీభత్సం
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో( jangareddy gudem ) గాలివాన బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఒక్కసారిగా పెను గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కుప్పకూలిపోయాయి. సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పంటలకు నష్టం కలిగింది. ప్రధానంగా మామిడి పంటకు నష్టం కలిగిందని రైతులు చెబుతున్నారు. ఉద్యానవన పంటలు సైతం దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.