AP Rain Alert: ఏపీకి( Andhra Pradesh) గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. భారీ వర్ష సూచన తెలిపింది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాల రాకతో వర్షాలు పడ్డాయి. అయితే అవి మందగించడంతో వర్షాలు తగ్గాయి. ప్రారంభంలో వర్షాలు పడడంతో ఈ ఏడాది ఖరీఫ్ ఆశాజనకంగా ఉంటుందని రైతులు ఆశించారు. విత్తనాలు కూడా చల్లుకున్నారు. అయితే క్రమేపి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆందోళనకు గురవుతున్నారు. వర్షం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read: ఇప్పటికీ వైసీపీ నేతలే.. చేతికి ‘ఇసుక’ అంటకుండా!
* మే నెలలో భారీ వర్షపాతం..
ఏటా జూన్లో( June) భారీగా వర్షాలు నమోదు కావడం పరిపాటిగా ఉంది. అయితే ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. దీంతో జూన్లో సైతం భారీగా వర్షాలు పడతాయని అంతా భావించారు. కానీ అనుకున్న స్థాయిలో పడలేదు. జూన్ నెలకు సంబంధించి చివరి వారంలో ఉన్నాము. అయితే ఈరోజు తో పాటు రేపు కూడా ఉత్తర కోస్తా, యానంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం పడుతున్న సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మూడు రోజులపాటు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, చిరుజల్లులు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
* భారీ వర్షం నమోదు
నిన్న చాలా జిల్లాల్లో భారీ వర్షం నమోదు అయింది. ముఖ్యంగా శ్రీశైలం( Srisailam), కాకినాడ,, యానాం, అమలాపురం, నెల్లూరు చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలంలో గరిష్టంగా 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాజమండ్రి, చిత్తూరు, అమలాపురం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదయింది. రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు ఉరుములతో కూడిన వర్షం పడనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.