AP Sand Mafia Scam 2025: ఏ పార్టీ అధికారంలో ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఇసుక దందా ఆగడం లేదు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఇసుకతో కోట్లు గడించిన వారు ఉన్నారు. అయితే మొన్నటి వరకు వైసిపి అండదండలతో ఇసుక దోపిడీ చేసిన వ్యక్తులే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నీడలో చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. అధికార కూటమి నేతలతో కుమ్మక్కై కొందరు వైసీపీ నేతలే ఇప్పటికీ ఇసుక దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఆ మూడు పార్టీల నేతలతో స్నేహం పెంచుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ ఇసుక దందాలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కృష్ణ, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఇప్పటికీ ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా తాడేపల్లి, కొల్లిపర, కొల్లూరు మండలాల్లో కూలీలతో ఇసుకను తవ్వించి.. రాత్రి సమయాల్లో వాహనాల్లో తరలించుకుని పోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తెర వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాఫియా ఇప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తుందన్న అనుమానాలు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి.
Also Read: Sand Mafia Controversy: ఇసుక దందాలో ఆ మంత్రి.. ఫోటోలు వైరల్!
ఆరితేరిపోయారు
1. ఇసుక తరలింపులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరితేరి పోయారు. ఇది జగమెరిగిన సత్యం కూడా. అయితే రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండడంతో.. వారు ఇప్పటికీ అదే పని కొనసాగిస్తున్నారు. కూటమి అంటేనే టిడిపి, బిజెపి, జనసేన. ఈ మూడు పార్టీల నేతలతో సయోధ్య ఏర్పాటు చేసుకొని.. అటు అధికార యంత్రాంగాన్ని లోబరుచుకొని ఇప్పటికీ అదే దందాను కొనసాగించగలుగుతున్నారన్న ఆరోపణలు ఆ రెండు జిల్లాల్లో ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇసుక తరలించే వాహనాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు వాటిని లీజుకు ఇచ్చి ఈ అక్రమ దందాలో వారు పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది.
2. అమరావతి మండలానికి చెందిన ఓ నేతకు నాలుగు లారీలు ఉన్నాయట. గత ఐదేళ్లలో ఆయన తెగరించిపోయారట. ఇప్పుడు అధికారం కోల్పోయినా ఆయన చేతికి నిండా పని దొరుకుతుందట.
3. పల్నాడు జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఒకరు వైసిపి హయాంలో లారీల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేసే వారట. ప్రభుత్వం మారిందే కానీ ఆయన అక్రమ రవాణా ఆగలేదన్న టాక్ వినిపిస్తోంది.
4. అమరావతి ప్రాంతంలోని బోరుపాలెం, రాయపూడి పరిధిలోని రీచ్ లలో అనధికారికంగా ఇసుకతవ్వేసి ట్రాక్టర్లలో ఇప్పటికీ తరలిస్తున్నారట. ఇందుకు ఓ మాజీ ఎంపీ అనుచరుల లారీలు వినియోగిస్తున్నారట.
5. మల్లాది, దిడుగు, మునుగోడు రీచ్ లలో గత ప్రభుత్వ హయాంలో టిడిపి సానుభూతిపరులకు పిడికెడు ఇసుక దొరికేది కాదు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు తమ సొంత అవసరాలకు ఇసుక తరలించుకుపోతున్నారట.
6. కొల్లిపర మండలం మున్నంగి ఇసుక రీచ్ లలో గతంలో స్థానికులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే నేతలు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారట. అయితే ఆ రెండు జిల్లాల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇసుక దందాలో ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అవి అంతిమంగా కూటమికి నష్టం చేకూరుస్తాయన్న టాక్ వినిపిస్తోంది.