Kollu Ravindra
AP Minister : వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత వైసిపి వర్సెస్ కూటమి నాయకుల యుద్ధం తారాస్థాయికి చేరింది. సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తారాస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.. ఇప్పటికే వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు.. ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి జరిగింది. నాటి దాడిలో వైసీపీ నేతలు ఉన్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాడు తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయం పై జరిగిన దాడి కేసును తెరపైకి తీసుకువచ్చింది. అయితే ఈ కేసులో సత్య వర్ధన్ అనే వ్యక్తి తాను ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. వల్లభనేని వంశీ అనుచరులు కిడ్నాప్ చేయడం వల్లే.. బెదిరించి, బలవంతంగా సంతకాలు చేయించడం వల్లే తను ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నానని సత్య వర్ధన్ పేర్కొన్నాడు. అతడు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఏపీ పోలీసులు గురువారం రాయదుర్గంలో వల్లభనేని వంశీని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విజయవాడ తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఆ తర్వాత జైలుకు పంపించారు.
కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత.. కూటమి ప్రభుత్వం తదుపరి ఎవరిని అరెస్ట్ చేయబోతుంది? అనే ప్రశ్నకు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం చెప్పారు. “వైసీపీ నేతలు పాపాలు చేశారు. వారు చేసిన పాపాలే జైలు పాలు చేస్తున్నాయి. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అనేక తప్పులు చేస్తున్నారు.. వల్లభనేని వంశీ అరెస్టుతోనే ఈ వ్యవహారం ఆగిపోదు. నాటి వైసిపి ప్రభుత్వం లో జరిగిన అక్రమాలను బయటకు తీస్తాం. అన్యాయానికి గురి చేసిన వారిని కచ్చితంగా జైలుకు పంపిస్తాం. వల్లభనేని వంశీ తర్వాత అరెస్టు అయ్యేది కొడాలి నాని, పేర్ని నాని లే.. వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీరిద్దరూ అవినీతికి పాల్పడ్డారు. అరాచకాలకు ఆజ్యం పోశారు. వాటిపై ఖచ్చితంగా విచారణ చేస్తాం. తగిన సాక్ష్యాధారాలతో జైలుకు పంపిస్తామని” రవీంద్ర హెచ్చరించారు. రవీంద్ర చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం కలిగించాయి. కొడాలి నాని, పేర్ని నాని లను తర్వాత అరెస్టు చేస్తామని కొల్లు రవీంద్ర చెప్పడంతో.. ఒక్కసారిగా కలకలం నెలకొంది. గత వైసిపి ప్రభుత్వం హయాంలో కొడాలి నాని, పేర్ని నాని కీలకంగా వ్యవహరించారు. ఇటీవల పేర్నీ నాని మీద బియ్యం అక్రమంగా అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆ బియ్యం సొమ్మును ప్రభుత్వం రాబట్టిందని వార్తలు వినిపించాయి. కేవలం బియ్యం వ్యవహారం మాత్రమే కాకుండా.. ఇంకా చాలా విషయాలలో పేర్ని నాని ఉన్నారని.. అనేక అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయనను అరెస్ట్ చేయడం తధ్యమని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అంటున్నారు. అంటే త్వరలో ఏపీలో మరిన్ని సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ అరెస్టుపై జగన్మోహన్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. త్వరలో కొడాలి నాని, పేర్ని నాని అరెస్ట్ తద్యమని కొల్లు రవీంద్ర చెబుతున్న నేపథ్యంలో జగన్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.