Minister Gummidi Sandhyarani : ఈ ఎన్నికల్లో చాలామంది కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు దాదాపు ఒక 50 మంది వరకు కొత్తగా ఎన్నికైన వారే. మంత్రివర్గంలో సైతం పదిమంది వరకుతొలిసారి ఎన్నికైన వారే ఉన్నారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించి చంద్రబాబు వారికి అవకాశం ఇచ్చారు. అదే సమయంలో సీనియారిటీకి, సిన్సియార్టీ కి సైతం పెద్దపీట వేశారు. అందులో భాగంగానే ఎస్టీ మహిళ ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణికి అవకాశం ఇచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు నుంచి గెలిచిన ఆమెకు క్యాబినెట్లోకి తీసుకున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖతో పాటు గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలను అప్పగించారు. ఆమె శాసనసభకు ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. అయినా సరే ఆమె పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం ఇచ్చారు చంద్రబాబు.
* 20 లక్షల రూపాయల రుణం
తాజాగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమెకు ఇప్పటివరకు సొంత వాహనం లేదని తెలుస్తోంది. సొంత వాహనం కోసం ప్రభుత్వం నుంచి 20 లక్షల రుణం తీసుకోవడం విశేషం. సాధారణంగా ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం అవసరాలకు రుణాలు మంజూరు చేస్తోంది. అందులో భాగంగా కొత్త కారును కొనుగోలు చేసేందుకు సంధ్యారాణికి పది లక్షల రూపాయలు రుణం మంజూరు అయింది. 30 నెలల్లో ఆమె జీతంలో ఈఎంఐ రూపంలో కొంత కోతపడుతుంది.
* జనసేన ఎమ్మెల్యేకు శ్రేణుల బహుమానం
కూటమి అధికారంలోకి వచ్చినపుడు జనసేన ఎమ్మెల్యే ఒకరికి ఆ పార్టీ శ్రేణులు కారును బహూకరించిన సంగతి తెలిసిందే. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చెర్రి బాలరాజు జనసేన నుంచి గెలిచారు. అయితే ఆయన ఒక సామాన్యుడు. గిరిజన కుటుంబం నుంచి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచినా సొంత వాహనం లేదు. అందుకే పార్టీ శ్రేణులు తలో మొత్తం వేసుకొని కారును కొనుగోలు చేశాయి. దానిని బహుకరించారు. అప్పట్లో ఈ వార్త హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు గుమ్మిడి సంధ్యారాణి కారుకు ప్రభుత్వం నుంచి రుణం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* ఎట్టకేలకు విజయం
సాలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్న దొరఫై విజయం సాధించారు గుమ్మడి సంధ్యారాణి. 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరారు సంధ్యారాణి. సాలూరు నియోజకవర్గం నుంచి ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2006 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలిగా కూడా పనిచేశారు. అనంతరం టిడిపిలో చేరారు. 2009లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో అరకు ఎంపీగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. దీంతో చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈ ఎన్నికల్లో రాజన్న దొరపై విజయం సాధించగా.. సంధ్యారాణి ఎస్టి మహిళ కావడం.. పార్టీలో సీనియర్ నేత కావడంతో ఆమెను క్యాబినెట్ లోకి తీసుకున్నారు.