YCP Leaders : : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరనున్నారు.అయితే ఆయన ఒక్కరే కాదు. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది నేతలతో కలిసి జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది. అయితే వీరంతా జగన్ సన్నిహిత నేతలే కావడం విశేషం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ కు స్వయానా బంధువు. అయినా సరే జగన్ తీరు నచ్చక పార్టీని వీడుతున్నారు. మరో సన్నిహిత నేత సామినేని ఉదయభాను సైతం బాలినేని తో కలిసి జనసేనలో చేరతారని టాక్ నడుస్తోంది. మాజీ మంత్రి ఆళ్ల నాని సైతం వీరిని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వీరంతా జనసేన నాయకత్వంతో టచ్లో ఉన్నట్లు సమాచారం. ఈ ముగ్గురు నేతలు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఎన్నికలకు ముందు నుంచే ఒక రకమైన అనుకూలతతో ఉన్నట్లు తెలుస్తోంది. వైసిపి ఓడిపోవడంతో వీరంతా పార్టీ నుంచి బయటపడాలని భావించారు. ఇప్పటికే ఆళ్ల నాని రాజీనామా చేశారు. నిన్ననే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏకంగా జగన్ తీరు నచ్చక బయటకు వెళ్ళిపోతున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అటు సామినేని ఉదయభాను అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
* ఆ కుటుంబానికి ఆత్మీయులు
అయితే ఈ నేతలంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి వీర విధేయులు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి 1999లో రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. రాజశేఖర్ రెడ్డి పై అభిమానంతోనే జగన్ వెంట అడుగులు వేశారు. ఇప్పుడు జగన్ తీరు నచ్చక బయటకు వెళ్ళిపోతున్నారు. బాలినేని సమీప బంధువు కావడంతో జగన్ పై విపరీతంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
* రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో
సామినేని ఉదయభాను సైతం రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు. 1999లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రోత్సాహం అందించి.. జగ్గంపేట కాంగ్రెస్ టికెట్ ఇప్పించారు. అప్పటినుంచి వైయస్సార్ కు వీర విధేయుడుగా ఉండేవారు. అదే అభిమానంతో జగన్ వెంట అడుగులు వేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. కానీ కాపు సామాజిక వర్గంలో తన జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చి.. తనను విస్మరించడం పై ఆవేదనతో ఉండేవారు. అందుకే ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.
* ఎంతో నమ్మకంతో
ఆళ్ల నాని సైతం వైయస్సార్ కు అత్యంత ఆత్మీయుడు. ఆయన ప్రోత్సాహంతోనే 1999లో ఏలూరు అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన నానికి జగన్ మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. విస్తరణలో మాత్రం మంత్రి పదవి కోల్పోయారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవి చూడడంతో పూర్తిగా సైలెంట్ అయ్యారు. వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డితో కలిసి జనసేనలో చేరుతారని తెలుస్తోంది. మొత్తానికైతే వైసీపీ నుంచి వైఎస్ఆర్ ఆత్మీయులు బయటపడుతున్నారు.