AP Mega DSC 2025 : ఏపీలో( Andhra Pradesh) ఉపాధ్యాయ నియామకానికి సంబంధించి డీఎస్సీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నిమిషం ఆలస్యం అయినా అనుమతించమని అధికారులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 154 కేంద్రాల్లో డీఎస్సీ పరీక్షలు కొనసాగనున్నాయి. ఏపీలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాలో సైతం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల అభ్యర్థుల సౌకర్యార్థం ఈ కేంద్రాలను సైతం అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు వీలైనంత త్వరగా డీఎస్సీ పూర్తిచేసి ఉద్యోగ నియామకాలు చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.
* భారీ డీఎస్సీ ప్రకటన
తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చారు. ఆ హామీకి తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఫైల్ గా సంతకం చేశారు. మధ్యలో టెట్ పరీక్షను నిర్వహించారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణ కారణంగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు జాప్యం జరిగింది. అయితే వర్గీకరణ కొలిక్కి రావడంతో ఏప్రిల్ 20న డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. 16,300 పోస్టులకు పైగా భర్తీ చేయనున్నారు. మే 15 వరకు దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 5.7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. 3.35 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉండడంతో రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Also Read : ఆన్‌లైన్ మాక్ టెస్టులతో సన్నద్ధం కండి!
* రోజుకు రెండు సెషన్లుగా..
పూర్తిగా ఆన్లైన్ లోనే( online) ఈ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లుగా ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్.. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండో సెషన్ జరగనుంది. అభ్యర్థులు పరీక్షకు కనీసం గంటన్నర ముందు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదు. రెండు చేతులు లేని అభ్యర్థులు, దృష్టిలోపం ఉన్నవారికి ప్రత్యేకంగా సహాయకుల సదుపాయం అందిస్తున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్టికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. హాల్ టికెట్ పై ఫోటో లేకపోతే.. రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని అధికారులు వెల్లడించారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డు లేదా వాటర్ ఐడి వంటి గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి తీసుకురావాలని సూచించారు.
* ఏళ్ల తరబడి ఎదురుచూపులు
డీఎస్సీ కోసం అభ్యర్థులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తూ వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్ రాలేదు. 2024 ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా కేవలం 6000 పోస్టులతో ఇచ్చారు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో డీఎస్సీ నియామక ప్రక్రియ నిలిచిపోయింది. అభ్యర్థులకు నిరాశ తప్పలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఆ 6000 పోస్టులకు మరో 10 వేల పోస్టులను జతచేస్తూ.. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు సైతం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ప్రతిష్టాత్మకంగా పరీక్ష నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈనెల 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.