AP Liquor Shops : మద్యం విక్రయాలపై ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో భారీ జరిమానాలు విధిస్తూ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంఆర్‌పి కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది. అలాగే మద్యం షాపుల పరిధిలో బెల్టుషాపులు నిర్వహిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. అయితే తీరు మార్చుకోకుండా రెండోసారి కూడా అదే తప్పు చేస్తే షాప్ లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 47(1) కింద నోటిఫికేషన్ విడుదల చేసింది. బార్ లైసెన్సులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఇప్పటికే చంద్రబాబు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విక్రయాలకు సంబంధించి పెనుమార్పులు తీసుకొచ్చారు. జగన్ హయాంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేయడంతో పాటు కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రైవేట్ మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు వార్తలు రావడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి వచ్చింది. చాలా చోట్ల ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువగా మద్యం విక్రయిస్తున్నారు. ఇదేమిటని ఆరా తీస్తే.. దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో అక్రమ మద్యం ఏరులై పారుతోంది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి మద్యాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. గ్రామాల్లో దందాలు చేస్తుంటే .. మద్యం వ్యాపారులు వైన్ షాపుల ద్వారా మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. చాలా చోట్ల ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువగా విక్రయిస్తూ.. మందు బాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. దీంతో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. కొత్త మద్యం పాలసీని అమలులోకి తెచ్చిన సంకీర్ణ ప్రభుత్వం.. వేలాది మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చింది. లక్షలు వెచ్చించి వ్యాపారుల నుంచి దుకాణాలు దక్కించుకున్నారు. దీంతో అధిక ధరకు మద్యం విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. మద్యం షాపుల్లో ఎంఆర్‌పీని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఒక రూపాయి కంటే ఎక్కువ విక్రయం జరిగినా రూ. 5 లక్షలు విధిస్తామని హెచ్చరించారు. మళ్లీ మళ్లీ అదే పని చేస్తే దుకాణాలకు ఇచ్చిన అనుమతులు రద్దవుతాయి. దీంతో ఎక్సైజ్ అధికారులు నిఘా పెంచారు. ఎంఆర్‌పీ ధరల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు.