AP Liquor Scam: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. రోజుకో మలుపు తిరుగుతోంది. కేంద్రం పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడం కూడా సంచలనంగా మారింది. దేశంలోనూ ఇదో పెద్ద కుంభకోణంగా ప్రచారం నడుస్తోంది. అందుకే ఈడి రంగంలోకి దిగినట్లు కూటమి నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో లోతైన దర్యాప్తు సాగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు విచారణను చేపడుతోంది. ఒకవైపు రాష్ట్రం పరిధిలోని సిట్, కేంద్రం పరిధిలోని ఈడీ ఏకకాలంలో రంగంలోకి దిగడంతో సంచలనాలు నమోదు కాబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య షర్మిల కు సంబంధం ఉన్నట్లు ఆధారాలు దొరికాయని నిన్న రోజంతా ప్రచారం నడిచింది.
* అనిల్ రెడ్డి పై అభియోగాలు..
మద్యం కుంభకోణంలో( liquorscam) ఇటీవల ప్రముఖంగా వినిపించిన పేరు వైయస్ అనిల్ రెడ్డి. ఈయన స్వయానా జగన్మోహన్ రెడ్డికి సోదరుడు అవుతారు. జగన్ పెదనాన్న జార్జి రెడ్డి కుమారుడు. చెన్నై తో పాటు బెంగళూరులో వ్యాపారాలు చేస్తుంటారు. ఈయన పేరుతో ఓ పది కంపెనీలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలు కూడా ఈయన చూస్తుంటారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో సైతం ఈయన డబ్బు పరంగా లావాదేవీలు చూస్తారని సమాచారం. అయితే మద్యం కుంభకోణంలో భాగంగా అందిన ముడుపులు.. ఈయన కంపెనీల ద్వారా బ్లాక్ మనీని వైట్ గా మార్చారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఒకవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఈయన పేరును బయటకు తెచ్చింది. అదే సమయంలో ఈయన కంపెనీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో భాగంగా వైయస్ భారతి రెడ్డికి సంబంధించి కీలక ఆధారాలు లభించినట్లు నిన్నంత మీడియాలో ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి బినామీ అనిల్ రెడ్డి అంటూ తెలుగు మీడియాలో పతాక శీర్షిక వార్తలు కూడా వచ్చాయి. అయితే భారతీ రెడ్డికి సంబంధించి ఎటువంటి వివరాలు ఈడికి చిక్కలేదని తెలుస్తోంది.
* కొన్నేళ్లపాటు డైరెక్టర్ గా..
వాస్తవానికి వైయస్ అనిల్ రెడ్డి ( Anil Reddy )కంపెనీల్లో భారతి రెడ్డి డైరెక్టర్ గా ఉండేవారట. కానీ ఆమె 2020లోనే ఆ కంపెనీ డైరెక్టర్ బాధ్యతలు నుంచి తప్పుకున్నారట. 2020 లోనే మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. అటువంటప్పుడు భారతి రెడ్డికి ఏం సంబంధం ఉంటుంది. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలు చూసే వ్యక్తి అనిల్ రెడ్డి కావడంతోనే ఈ అనుమానాలన్నింటికీ కారణం. పైగా ఆయన జగన్ పెదనాన్న జార్జిరెడ్డి కుమారుడు కావడం, ఆయనకు విదేశాల్లో కంపెనీలు ఉండడం, మద్యం ముడుపుల ద్వారా వచ్చిన బ్లాక్ మనీని విదేశీ కంపెనీల ద్వారా వైట్ గా మార్చడం, లాండరింగ్ కు అవకాశం ఉండడం వంటి కారణాలతోనే నిన్న రోజంతా మీడియాలో ప్రచారం నడిచింది. కానీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు దొరికాయనడం మాత్రం అసత్యం. అందులో ఎంత మాత్రం నిజం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో సంచలనాల కోసమే ఈ ప్రచారం అని కొట్టి పారేస్తున్నారు.