AP Liquor Scam Case: మద్యం కుంభకోణానికి( liquorscam) సంబంధించి విచారణకు విజయసాయిరెడ్డి ఎందుకు హాజరు కాలేదు? అన్ని విషయాలను చెబుతానని చెప్పిన ఆయన ఇప్పుడు ముఖం చాటేశారు ఎందుకు? పది రోజులపాటు సమయం అడిగింది ఎందుకు? ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చ. విజయసాయిరెడ్డి వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని తిరిగి పార్టీలో చేర్చుకుంటారని.. అందుకు తగ్గట్టు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతోందని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. సరిగ్గా అదే సమయంలో లిక్కర్ స్కామ్ ను దర్యాప్తు చేస్తున్న సిట్ నుంచి విచారణకు హాజరుకావాలని విజయసాయి రెడ్డికి నోటీసు వెళ్ళింది. అయితే తాను చాలా బిజీగా ఉన్నానని.. పది రోజుల తర్వాత వచ్చి కలుస్తానని విజయసాయిరెడ్డి బదులిచ్చారు. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా విజయసాయి రెడ్డికి వచ్చిన పని ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న.
అసలు విషయం చెప్పక..
మద్యం కుంభకోణంలో సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) తేల్చేశారు. మద్యం కంపెనీలతో డీల్ మాట్లాడేందుకు సమావేశం జరిగిందని.. ఆ సమావేశంలో తాను పాల్గొన్నానని.. అయితే అందులో తనకు ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. అయితే తాజాగా మరో ప్రచారం నడుస్తోంది. మద్యం కుంభకోణంలో రాజు కసిరెడ్డికి స్వేచ్ఛ ఇవ్వడంతోనే.. విజయసాయిరెడ్డి అలిగినట్లు తెలుస్తోంది. తనను తప్పించి రాజ్ కసిరెడ్డికి మద్యం బాధ్యతలు అప్పగించడం ఏంటి అనేది విజయసాయిరెడ్డి కోపంగా మారినట్లు సమాచారం. అందుకే అప్పటి నుంచి రాజ్ కసిరెడ్డి సూత్రధారి అంటూ చెప్పుకొస్తున్నారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏం మాట్లాడానని విజయసాయిరెడ్డి ఇంతకుముందు చెప్పినట్లు తెలిసిందే. అయితే అసలు సూత్రధారి పేరు చెప్పకుండా విజయసాయిరెడ్డి నాటకం ఆడుతున్నారన్నది సిట్ గుర్తించిన అంశం.
Also Read: Lokesh KTR meeting: లోకేష్.. కేటీఆర్.. కలయిక కథేంటి?
ఆధారాలతో సహా..
అయితే ఇప్పటివరకు మద్యం కుంభకోణంలో సాక్షి పేరిట విచారణకు పిలిచారు విజయసాయిరెడ్డిని సిట్ ( special investigation team)అధికారులు. కానీ ఆయన వ్యవహార శైలి చూస్తుంటే అనుమానాలు కలగక మానదు. అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందం విజయసాయిరెడ్డి పాత్ర పై ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఏ 5 నిందితుడిగా ఉన్నారు విజయసాయిరెడ్డి. మద్యం కుంభకోణంలో ఆయనకు దండిగానే డబ్బులు అందినట్లు ఆధారాలు దొరికినట్లు సమాచారం. ఆ డబ్బులు అరబిందో ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సిట్ విచారణలో విజయసాయిరెడ్డికి సంబంధించి సంచలన అంశాలు బయటపడినట్లు సమాచారం. అందుకే వాటిపై ప్రశ్నిస్తారు అన్న నెపంతోనే విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరు కాలేదని.. ఓ పది రోజుల సమయం అడిగారని అనుమానాలు ఉన్నాయి. ఈ పది రోజుల్లో తనకున్న పరిచయాల ద్వారా ప్రమాదం నుంచి బయటపడే అంశాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.