AP Liquor Scam: మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం తొలి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించింది. దాదాపు 300 పేజీలకు పైగా ఈ ఛార్జ్ షీట్లో అంశాలను ప్రస్తావించింది. అందులో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరు పలుచోట్ల ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరో 20 రోజుల్లో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారని.. అందులో అంతిమ లబ్ధిదారుడు ఎవరు అన్నది తేలిపోనుందని తెలుస్తోంది. మరోవైపు రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ నిన్ననే జరిగింది. దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఆయనను అరెస్టు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అదే సమయంలో చార్జ్ షీట్ సమర్పించగా.. అందులో సైతం కీలక అంశాలను వెల్లడించింది ప్రత్యేక దర్యాప్తు బృందం.
పాలసీ తయారీలో పాత్ర..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చింది. ఈ క్రమంలోనే ఆ పాలసీ రూపకల్పనలో మిధున్ రెడ్డి పాత్ర ఉన్నట్టు తేల్చింది సిట్. మద్యం పాలసీ ద్వారా భారీగా ముడుపుల సేకరణ… మద్యం కంపెనీల నుంచి వసూళ్లు వంటివి మిథున్ రెడ్డి రూపకల్పన చేశారని.. రాజ్ కసిరెడ్డి ద్వారా మొత్తం వ్యవహారాన్ని నడిపారని సిట్ దర్యాప్తులో తేలింది. అయితే అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది తరువాత చార్జిషీట్లో వివరించనున్నట్లు తెలుస్తోంది. అయితే నిన్న ఏడు గంటల పాటు సాగిన విచారణలో మిధున్ రెడ్డి నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు మద్యం కుంభకోణం కేసులో అప్పటి సీఎం ఓ అధికారి ధనుంజయ రెడ్డి, ఓ ఎస్ డి కృష్ణ మోహన్ రెడ్డి, జగన్ సన్నిహితుడు గోవిందప్ప బాలాజీ, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. వంటి 11 మంది నిందితులను అరెస్టు చేశారు. మరో 10 మంది వరకు కీలక నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఆచూకీ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
200 మందికి పైగా సాక్షులు..
దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ప్రత్యేక దర్యాప్తు బృందం (special investigation team) విచారణ లోతుగా సాగినట్లు స్పష్టమవుతోంది. 200 మందికి పైగా సాక్షులను విచారించినట్లు తెలుస్తోంది. మొత్తం మద్యం పాలసీ తయారీలో ఎవరెవరి పాత్ర ఉంది? అందులో హవాలా రూపంలో ఎంత మొత్తం దేశం దాటింది? మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏ వ్యాపారాలకు మళ్లీంచారు? అనే అంశాలపై క్షుణ్ణమైన దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా బంగారం వ్యాపారానికి మద్యం సొమ్మును వినియోగించారని పక్కా ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయి. అయితే అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది స్పష్టం చేసే ముందు పూర్తిస్థాయి వివరాలు, ఆధారాలను రెండో చార్ట్ షీట్లో బహిర్గతం చేస్తారని తెలుస్తోంది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసుగా ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కానీ పక్కా ఆధారాలతో ప్రజల మధ్య ఉంచి.. రాజకీయంగా కూడా విపక్షాన్ని నిర్వీర్యం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి అయితే ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
ఆది నుంచి ప్రభుత్వానిది అదే పట్టు..
మద్యం కుంభకోణానికి సంబంధించి ఆది నుంచి కూటమి ప్రభుత్వం ( Alliance government) ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో తప్పకుండా మద్యం కుంభకోణం జరిగిందని అనుమానిస్తూ వస్తోంది. అయితే ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపినప్పుడు కుంభకోణం ఎలా జరుగుతుందనేది వైసిపి వాదన. కానీ మద్యం పాలసీ తయారీలోనే లోపం ఉందని.. మద్యం కంపెనీలను, డిష్టలరీలను బెదిరించి భారీగా ముడుపులు వసూలు చేశారని కూటమి అనుమానించింది. దానికి తగ్గట్టు ప్రాథమిక ఆధారాలను సేకరించింది. వాటన్నింటిపై స్పష్టత వచ్చాక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది.